కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా… అందులో ఎదో ఒక మెలిక ఉండనే ఉంటుంది. ఈ తరహా నిర్ణయాలను కేంద్రం తెలిసి తీసుకుంటుందో… లేదంటే అవగాహన లేక తీసుకుంటుందో తెలియట్లేదు. అయితే ఆ నిర్ణయాలు మాత్రం ఆయా ప్రాంతాల ప్రజల మనోభావాలను దెబ్బ తీస్తూనే ఉంటున్నాయి. తాజాగా ఏపీ పునర్వ్యవస్తీకరణ చట్టంలో ఇచ్చిన హామీ మేరకు విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ను ప్రకటించింది. కొత్త జోన్ పరిధిపై కేంద్రం తీసుకొన్న నిర్ణయంపై ఏపీ ప్రజల్లో ఆందోళన నెలకొంది. అయితే… ఏపీ ప్రభుత్వం నుంచి ఈ ఆందోళనను తెలుసుకున్నంతనే… కేంద్రం మార్పు చేర్పులు చేసి నూతన పరిధిని ప్రకటించింది.
ఈ మేరకు రైల్వే శాఖా మంత్రి అశ్విని వైష్ణవ్ శుక్రవారం రాత్రి ఓ కీలక ప్రకటన చేసారు. విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేస్తున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ కు సంబంధించి నూతన పరిధికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి ప్రకటించారు. అంతేకాకుండా ఏపీ ప్రజలు కోరినట్టుగా వాల్తేర్ డివిజన్ ను కొత్త రైల్వే జోన్ లోనే కొనసాగిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. అయితే వాల్తేర్ డివిజన్ పేరును విశాఖపట్నం డివిజన్ గా మారుస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఏపీ పునర్వ్యవస్తీకరణ చట్టానికి లోబడి కొత్త రైల్వే జోన్ ను ఏర్పాటు చేశామని కూడా మంత్రి చెప్పారు.
దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుతో కొత్తగా రాయగడ పేరిట ఓ డివిజన్ ను ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర మంత్రి తెలిపారు. ఈ డివిజన్ ను ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ లో కలుపుతున్నట్టు ఆయన తెలిపారు. మరి ఈ జోన్ లో ఏపీ ప్రజలు అనుమానిస్తున్నట్లు అరకు స్టేషన్ దానిలో ఉందా? లేదా? అన్న దానిపై మాత్రం స్పష్టత లేదు. దీని గురించి మంత్రి ప్రస్తావించలేదు. ఏపీ పర్యాటకానికి మకుటాయమానంగా నిలిచిన అరకును రాయగడ డివిజన్ లో కలిపితే మాత్రం ఏపీ ప్రజల నుంచి మరోమారు కేంద్రానికి తలనొప్పి తప్పదని చెప్పాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates