సీఎం చంద్రబాబుపై ఎప్పుడు బురదజల్లుదామా అనే కాన్సెప్ట్ తో వైసీపీ నేతలు రెడీగా ఉంటారని టీడీపీ నేతలు విమర్శిస్తుంటారు. చంద్రబాబు ఒక ఉద్దేశ్యంతో చెప్పిన విషయంలో నానార్థాలు తీసి..చిలవలు పలవలుగా చేసి ఆయన ఇమేజ్ కు డ్యామేజ్ చేయడమే వైసీపీ నేతలు పనిగా పెట్టుకున్నారని వారు ఆరోపిస్తుంటారు. ఈ కోవలోనే తాజాగా మంత్రులకు చంద్రబాబు ఇచ్చిన ర్యాంకులపై కూడా వైసీపీ నేతలు నానా యాగీ చేస్తున్నారు. చంద్రబాబు, పవన్, లోకేష్ ల ర్యాంకులపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఆ కామెంట్లకు చంద్రబాబు తాజాగా కౌంటర్ ఇచ్చారు. ఫైళ్ళ క్లియరెన్స్ లో మంత్రులకు ర్యాంకులు ఇచ్చామని, ఎవరినీ ఎక్కువ, తక్కువ చేయడానికి కాదని చెప్పారు. మంత్రులు ఒకరితో ఒకరు పోటీ పడి పనిచేసి వేగవంతమైన పాలన అందిస్తారన్న ఉద్దేశ్యంతో చేసిన చిన్న ప్రయత్నమే ఇదని వివరించారు. గ్రామ స్థాయిలో చిరుద్యోగి మొదలు ముఖ్యమంత్రి వరకు సమిష్టిగా పనిచేస్తేనే ప్రజా సమస్యలు సత్వరమే పరిష్కరించి రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టగలమని చెప్పారు.
కూటమి నేతలపై అపారమైన నమ్మకంతో 2024 ఎన్నికల్లో 93 స్ట్రైక్ రేట్ తో ప్రజలు చరిత్రాత్మక తీర్పును, విజయాన్ని ఇచ్చారని గుర్తు చేశారు. కాబట్టి అధికారం చేపట్టిన తొలి గంట నుంచి వారి ఆకాంక్షలు నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. వైసీపీ విధ్వంసం వల్ల నాశనమైన వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు శాయశక్తులా కష్టపడుతున్నామని చెప్పారు.
పథకాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నేతలంతా కష్టపడాలని, టీమ్ వర్క్ ఉంటేనే ఉత్తమ ఫలితాలు సాధించగలమని అన్నారు. అసాధారణ, వేగవంతమైన పనితీరుతోనే రాష్ట్ర పునర్నిర్మాణ ఫలితాలను ప్రజలకు చూపలేమని చెప్పారపు అందుకే ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరు టీం స్పిరిట్ తో పనితీరుపై సమీక్షించుకుని పనిచేయాలన్న ఉద్దేశ్యంతోనే ర్యాంకులు విడుదల చేశామని క్లారిటీనిచ్చారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates