టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఏది చేసినా పక్షపాతం అన్నది కనిపించదు. చివరకు ఆ విషయం తనదాకా వచ్చినా కూడా ఆయన నిస్పక్షపాతంగానే వ్యవహరిస్తారు. ఈ మాట నిజమేనని మరోమారు నిరూపితమైంది. గురువారం నాటి కేబినెట్ భేటీలో పనితీరును బట్టి మంత్రులకు ర్యాంకులు ఇచ్చారు. ఇందులో చంద్రబాబుకు కూడా ర్యాంకు ఇచ్చారు. ఈ ర్యాంకుల్లో బాబుకు ఆరో ర్యాంకు వచ్చింది. సీఎం గా ఉన్న చంద్రబాబుకు ఆరో ర్యాంకు వస్తే.. బాబు కేబినెట్ లో ఆయనను మించిన పనిమంతులు ఐదుగురు ఉన్నట్టే కదా.
అయినా.. ఈ ర్యాంకుల్లో చంద్రబాబు కంటే ముందున్న వారు ఎవరన్న విషయానికి వస్తే .. ఫస్ట్ ర్యాంకర్ గా టీడీపీ సీనియర్ నేత, న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూఖ్ ఉన్నారు. తన పరిధిలోని శాఖల ఫైళ్లను ఈయన చాల వేగంగా పరిష్కరిస్తున్నారట. వయస్సులో దాదాపుగా చంద్రబాబు సమకాలీకుడిగా ఉన్న ఫరూఖ్ కుర్ర కారు నేతల కంటే ఫైళ్ల పరిష్కారంలో ఇలా దూసుకుపోతున్న తీరు నిజంగానే ఆభినందించదగ్గ విషయమే. రాయలసీమలోని నంద్యాల నుంచి ఈయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ స్పీడు కారణంగానేనేమో చంద్రబాబు ఎప్పుడు సీఎం అయినా ఆయన కేబినెట్ లో ఫరూఖ్ తప్పనిసరిగా స్తానం సంపాదిస్తున్నారు.
ఇక ఫరూఖ్ తర్వాత… బాబు కంటే ముందున్న వారిలో పర్యాటక శాఖా మంత్రి కందుల దుర్గేష్, చిన్న తరహా పరిశ్రమల శాఖా మంత్రి కొండపల్లి శ్రీనివాస్, పౌర సరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్, సాంఘీక సంక్షేమ శాఖా మంత్రి డోలా బలవీరాంజనేయ స్వామి వరుస క్రమంలో ఉన్నారు. బాబు కంటే మంచి పనితీరు కనబరుస్తున్న ఈ ఐదుగురిలో ముగ్గురు టీడీపీ నేతలు కాగా ఇద్దరు జనసేనకు చెందిన నేతలు ఉన్నారు. ఫరూఖ్, కొండపల్లి, డోలా లు టీడీపీకి చెందిన వారు కాగా కందుల, నాదెండ్లలు జనసేనకు చెందినవారు.
ఇక ఉత్తమంగా రాణిస్తున్న మంత్రుల్లో చంద్రబాబు ఆరో స్థానంలో ఉంటే.. చంద్రబాబు తనయుడు, ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ ఎనిమిదో స్థానంలో ఉన్నారు. ఇక జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పదో స్థానంలో ఉన్నారు. ఇదిలా ఉంటే.. ప్రభుత్వం ఏర్పడి కేవలం 7 నెలలే అవుతున్న నేపథ్యంలో ఈ ర్యాంకులు ఆయా నేతల పనితీరుకు గీటురాయి కాదన్న వాదనలూ వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా పనితీరులో తనను కూడా కలుపుకుని ర్యాంకులు ఇచ్చిన చంద్రబాబు తీరుపై ఇప్పుడు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.