ఈ నెల 24వ తేదీ నుంచి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో 2025-26 వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశ పెట్టనున్నారు. దీనికి సంబంధించిన క్రతువు పూర్తయిందని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఏయే ప్రాజెక్టులకు ఎంతెంత కేటాయించాలి? సూపర్ సిక్స్‌లో ఏయే పథకాలకు ఎంత ఇవ్వాలన్న విషయాలపై ఇప్పటికే క్లారిటీ వచ్చేసిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సీఎం చంద్రబాబు ఆర్థిక శాఖ అధికారులు, మంత్రితోనూ భేటీ అయ్యారు.
వాస్తవానికి ముందస్తుగా నిర్ణయం తీసుకున్న ప్రకారం అయితే..ఈ ఏడాది కూడా సూపర్ సిక్స్ గురించి పెద్దగా ప్రస్తావించే అవకాశం లేదు. కానీ, ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్న తీసుకున్న తర్వాత.. గట్టిగా మూడు పథకాలపై ప్రజల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. వీటిలో ప్రధానంగా మాతృవందనం పథకాన్ని మహిళలు ఎక్కువగా కోరుతున్నారు. ఆ వెంటనే రెండోది ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. మూడో రైతులకు ఇస్తామన్న అన్నదాత సుఖీభవ పథకం.
ఈ మూడు పథకాలకు తోడు.. 18 ఏళ్లు నిండిన మహిళలకు నెల నెలా ఇస్తామన్న రూ.1500 ఆడబిడ్డ నిధి. ఈ నాలుగు పథకాలు కూడా.. ప్రజలు ఎక్కువగా కోరుకుంటున్నారు. సర్వేలు.. ప్రజల అభిప్రాయాలను సంపూర్ణంగా తెలుసుకున్నాక.. ఈ నాలుగు పథకాల్లో రెండింటినైనా తాజా బడ్జెట్‌లో ప్రవేశ పెట్టకపోతే.. ఇబ్బంది తప్పదని ప్రభుత్వం గుర్తించింది. దీంతో ఆయా పథకాల్లో భారీ భారం పడని.. ఆర్టీసీలో ఉచిత ప్రయాణానికి నిధులు కేటాయించే అవకాశం ఉందని తెలిసింది.
అదేవిధంగా రైతులకు ఇస్తామన్న అన్నదాత సుఖీభవను కూడా బడ్జెట్‌లో ప్రస్తావించనున్నారు.ఇది కొంత వరకు భారమే అయినా.. కేంద్రం సాయం చేస్తున్న 6 వేల రూపాయలను దీనిలో కలిపి ఇవ్వను న్నారు. దీంతో కొంత వరకు ఆర్థిక భారం నుంచి తప్పించుకునే వెసులు బాటు ఉండనుంది. ఇక, ఆర్టీసీ బస్సుల కోసం.. నెలకు రూ.180-200 కోట్ల వరకు భరించేందుకు కూడా.. సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. దీంతో ఈ రెండు పథకాలకు కూడా.. బడ్జెట్‌లో చోటు దక్కే అవకాశం ఉందని ఆర్థిక వర్గాలు చెబుతున్నాయి.