వైసీపీ అధినేత జగన్ నివాసం కమ్ పార్టీ ప్రధాన కార్యాలయం ఉన్న గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ప్యాలస్‌కు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. ఈ వ్యవహారం.. గురువారం ఉదయం 7 గంటలకు జరిగినట్టు తెలుస్తోంది. అయితే.. అటువైపు ఎవరినీ రాకుండా.. జగన్ భద్రతా సిబ్బంది కట్టుదిట్టమైన భద్రత కల్పించడంతో విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. భారీ ఎత్తున రాజుకున్న మంటలను పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆర్పేసే ప్రయత్నం చేశారు.
అయితే.. ఈ నిప్పు వెనుక కొన్ని నిజాలు దాచేప్రయత్నం చేస్తున్నారంటూ.. టీడీపీ నాయకులు విమర్శ లు గుప్పించారు. రాష్ట్ర ప్రభుత్వం.. జగన్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం(లిక్కర్ స్కామ్)పై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేస్తూ.. బుధవారం రాత్రి ఉత్తర్వులు ఇచ్చింది. విజయవాడ పోలీసు కమిషనర్ రాజశేఖరబాబు దీనిని నేతృత్వం వహిస్తున్నారు. ఈ కేసులో ఎంతటి వారు ఉన్నా.. వదలద్దని.. ఎవరినైనా ప్రశ్నించాలని.. పేర్కొంటూ.. ప్రభుత్వం విశేష అధికారాలు ఈ సిట్‌కు కట్టబెట్టింది.
అంతేకాదు.. ఎంతవారినైనా అరెస్టు చేసే అధికారం కూడా కల్పించింది. ఆస్తులు స్వాధీనం చేసుకునేలా కూడా అవకాశం కల్పించింది. ఈ పరిణామం జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే తాడేపల్లి ప్యాలస్ వద్ద అగ్గి రాజుకోవడం.. దీనిలో కొన్ని ఫైళ్లు, డైరీలు కూడా తగలబడడం వంటివి అనేక సందేహాలకు తావిస్తున్నాయని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. “ప్యాలెస్ బయట తగలబడిన కాగితాలు, డైరీలు ఏంటి ? సిట్ తన ఇంటి దాకా వస్తుందని, ముందే లిక్కర్ స్కాంకి సంబంధించి తాను రాసుకున్న లెక్కలు, డాక్యుమెంట్లు తగల బెట్టారా?” అంటూ.. టీడీపీ నాయకులు జగన్ పై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాదు.. ఉదయం ఎప్పుడో జరిగిన ఘటనకు సంబధించి.. ఇప్పటి వరకు తన ఇంటి ముందు ఉన్న సిసి ఫుటేజ్ ఎందుకు బయట పెట్టలేదని కూడా నిలదీశారు. “కీలక ఫైళ్లను తానే తగలబెట్టి, ప్రభుత్వం మీద తోసేయటమే, 2.0నా?” అని ప్రశ్నిస్తున్నారు. “ఎన్ని కుట్రలు చేసినా వదిలేది లేదు. సిట్ వస్తుంది, విచారణ చేస్తుంది, నీ అవినీతిని బయటకు తీస్తుంది.. గెట్ రెడీ” అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానించడం గమనార్హం.