ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్టు సీఈవో నారా భువనేశ్వరి.. తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో మ్యూజికల్ ఈవెంట్ నిర్వహించనున్న నేపథ్యంలో ఆమె ఇక్కడ పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “మా ఇంటాయనే ముఖ్యమంత్రి.. అయినా మా బాధలు మావే!” అని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ ట్రస్టు సహా హెరిటేజ్‌కు సంబంధించిన సమస్యలు పెండింగులో ఉన్నాయని తెలిపారు.
“గత ఐదేళ్లలో ఒక్క ఫైలు కూడా ముందుకు కదలేదు. ఇలా ఎందుకు జరిగిందో మీకు తెలుసు. ఇక, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చిందని మీరు(మీడియా) అంటున్నారు. అయినా.. ఫైళ్లు ముందుకు సాగడం లేదు. ఏం చెబుతాం. అన్నీ వరుస క్రమంలో జరుగుతాయని అధికారులు చెబుతున్నారు. అదేమంటే.. మా ఇంటాయనే ముఖ్యమంత్రి అని మీరు అంటున్నారు. కానీ, ఆయన ఏదీ ఒకపట్టాన తేల్చరు. దేనికీ.. దొడ్డిదారి వద్దంటారు. అందుకే.. పనులు కొంత ఆలస్యమవుతున్నాయి” అని భువనేశ్వరి అన్నారు.
కూటమి సర్కారుకు రాక మునుపు ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఎన్టీఆర్ మోడల్ స్కూల్ పేరుతో రెండు సంస్థలను స్థాపించాలని(ఇప్పటికే ఉన్నవి పోగా) భువనేశ్వరి భావించారు. కానీ, వాటిలో కదలిక రావడం లేదు. తాజాగా మీడియా ఈ ప్రశ్న సంధించినప్పుడుపై విధంగా వ్యాఖ్యానించారు. ఇక, మ్యూజికల్ నైట్ గురించి మాట్లాడుతూ.. ఎంతటి వారైనా.. దీనికి టికెట్ కొని రావాల్సిందేనని వ్యాఖ్యానించారు.
సీఎం చంద్రబాబు కూడా టికెట్లు కొన్నారని చెప్పారు. నారా, నందమూరి కుటుంబాలకు మొత్తంగా రూ.6 లక్షలు ఖర్చు పెట్టి ఆయన టికెట్లు కొన్నారని వెల్లడించారు. అయితే.. దీనిలో మీడియాకు మాత్రమే కొంత మినహాయింపు ఉంటుందని.. ఎంపిక చేసిన ప్రదాన మీడియా నుంచి ఇద్దరిని అనుమతించనున్నట్టు తెలిపారు. సొంత సంస్థలే అయినా.. నిబంధనల ప్రకారం వ్యవహరించాలని చంద్రబాబు చెబుతున్నట్టు పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు నవ్వుల పువ్వులు పూయించాయి.