కాలం కలిసి వచ్చి.. గాలి వాటంగా వీసే వేళలో.. తమకు మించిన తోపులు మరెవరు ఉండరన్నట్లుగా మాటలు మాట్లాడే గులాబీ బాస్.. కాస్త తేడా వచ్చినంతనే అందుకు భిన్నమైన స్వరాన్ని వినిపించటం మామూలే. తాజాగా మరోసారి ఆయన తీరు అందరికి అర్థమయ్యే పరిస్థితి. త్వరలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు కాగా.. ఒకటి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం. వీటి నామినేషన్ ప్రక్రియ ఇప్పటికే కొనసాగుతోంది.
ఇలాంటి వేళలో.. బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తుందా? లేదా? అన్నదానిపై ఆ పార్టీకి చెందిన వారెవరూ మాట్లాడని పరిస్థితి. రాష్ట్ర విభజన తర్వాత.. తెలంగాణ ఆవిర్భావం నాటి నుంచి ఎన్నికలు ఏవైనా దూకుడు ప్రదర్శించే గులాబీ పార్టీ తాజాగా జరుగుతున్న మూడు ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో మాత్రం మౌనాన్ని ప్రదర్శిస్తున్నారు.ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ప్రస్తుతం జరుగుతున్న మూడు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల్లో రెండు స్థానాలు బీఆర్ఎస్ కు అధికంగా ఎమ్మెల్యేలు ఉన్న జిల్లాలవే కావటం.. పార్టీ మొదట్నించి బలంగా ఉన్నజిల్లాల్లో జరుగుతున్నాయి.
ఇలాంటి వేళ.. ఎన్నికల్లో పోటీ చేసి ఫలితం వేరుగా ఉంటే జరిగే నష్టం కంటే.. పోటీకి దూరంగా ఉండటం మంచిదన్నఆలోచనలో గులాబీ బాస్ ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి ఆయన ఇలాంటి వ్యూహాన్ని ఉద్యమం వేళలోనూ పాటించారు. బలం లేని వేళ.. ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండటం.. పరిస్థితి తమకు కాస్త అనుకూలంగా ఉన్నా వెంటనే పోటీకి దిగి.. భావోద్వేగంతో ఎన్నికల్లో గెలవటం తెలిసిందే.
ఇప్పుడు కూడా అదే పాతపద్దతిని ఫాలో కావటం మంచిదన్న ఉద్దేశంతో ఉన్నట్లు చెబుతున్నారు. దీనికి తోడు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో ఉపాధ్యాయ సంఘాల ప్రభావం ఎక్కువ. పట్టభద్రుల ఎమ్మెల్సీలోనూ వ్యూహాత్మకంగా వ్యవహరించే బీజేపీ.. అధికార కాంగ్రెస్ ధాటికి నిలవటం కష్టంగా మారుతుందన్న ఉద్దేశంతో ఎన్నికలకు దూరంగా ఉండటం మంచిదన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.
అందుకే.. ఎన్నికలు జరుగుతున్నా.. దాని ఊసే తమకు పట్టలేదన్నట్లుగా వ్యవహరిస్తుండటం వ్యూహంలో భాగంగా తెలుస్తోంది. ఇక్కడే ఇంకో విషయాన్ని చెప్పాలి. అధికారం చేతిలో ఉన్నప్పుడు ఎన్నికల్లో ఓడిన పార్టీలను ఉద్దేశించి గులాబీ ముఖ్యనేతలు కేసీఆర్.. కేటీఆర్.. హరీశ్ రావు.. కవితలు ఇష్టారాజ్యంగా మాట్లాడేవారు. అలాంటి పార్టీ ఇప్పుడు ఎన్నికల బరిలోకి కూడా దిగకపోవటంపై కాసింత వివరణ కూడా ఇవ్వరా? అన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.