తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది. “కుల గణనపై మీరు చేసిన వ్యాఖ్యలు అసంబద్ధం. ఇవి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని కూడా అవమానించాయి. దీనిపై 15 రోజుల్లో గా మీ సమాధానం చెప్పండి” అని మల్లన్నకు జారీ చేసిన షోకాజ్ నోటీసుల్లో కాంగ్రెస్ పార్టీ పెద్దలు స్పష్టం చేశారు. మంగళవారం తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కులగణనకు సంబంధించిన నివేదికను ప్రవేశ పెట్టారు. బీసీలకు న్యాయం చేస్తామని వారికి 42 శాతం రిజర్వేషన్ ఫలాలు అందేలా చూస్తామని చెప్పారు. ఈ నివేదికలోని సారాంశాన్ని కూడా ఆయన వివరించారు.
అయితే.. విపక్ష బీఆర్ఎస్ నాయకులకు మించిన విధంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సొంత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈ నివేదికను ‘రెడ్డి కుల గణన నివేదిక’గా పేర్కొన్నారు. అంతేకాదు.. ఆర్థికంగా వెనుక బడిన అగ్రకులాలను కాపాడుకునేందుకు చేసిన సర్వే అని.. ఇది బీసీలకు ఏమాత్రం న్యాయం చేయదని చెప్పుకొచ్చారు. బీసీలకు అసలు న్యాయం చేసే ఉద్దేశం కూడా ఈ ప్రభుత్వానికి లేదన్నారు. దీనిని పూర్తిగా అగ్రకులాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన నివేదికగా పేర్కొన్నారు. ఈ కమిటీలో సభ్యుడు, సీనియర్ నేత జానారెడ్డిపైనా తీన్మార్ విమర్శలు గుప్పించారు.
కట్ చేస్తే.. పార్టీ ఆయనకు నోటీసులు పంపించింది. సమాధానం చెప్పాలని, మీరు చేసిన వ్యాఖ్యలతో పార్టీ పరువు పోయిందని పేర్కొంది. అయితే.. దీనిపైనా మల్లన్న అగ్గిమీద గుగ్గిలం మాదిరిగా మండి పడ్డారు. “నాకు నోటీసులు ఇవ్వడానికి మీరెవరు. కాంగ్రెస్ పార్టీ మీ అయ్య జాగీరా” అంటూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. మా పార్టీ(కాంగ్రెస్‌ను బీసీలతో పోల్చారు)ని మీరు(రెడ్డి నాయకులు) వాడుకుని మాపైనే పెత్తనం చేస్తారా? అంటూ.. నిప్పులు చెరిగారు.
అంతేకాదు.. బీసీలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. కుల గణన కాదని.. ఇది రెడ్డి గణన అని బహిరంగ వ్యాఖ్యలే చేశారు. ఈ విషయం తెలిసి కూడా.. కొందరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నోరు ఎత్తడం లేదని.. వారికి ప్రజలే తగిన విధంగా బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. “ఇది కుల గణన, బీసీ గణన కాదు.. పూర్తిగా రెడ్డి గణన. జానారెడ్డి కోసం చేసిన గణన” అని మల్లన్న వ్యాఖ్యానించారు.