ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న ఆయన… 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ పై ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అదికారం చేపట్టడంతో ఆయన కాంగ్రెస్ గూటికి చేరారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు తనపై విమర్శలు గుప్పిస్తుండగా… వారిపై దానం ఒంటికాలిపై లేస్తున్న వైనం తెలిసిందే. అయితే కాంగ్రెస్ సర్కారు ఏర్పాటు చేసిన హైడ్రా చర్యలపైనా దానం ఏమాత్రం రాజీ పడటం లేదు. హైడ్రా చర్యలను తీవ్రంగా ఖండిస్తున్న దానం.. హైడ్రా విషయంలో తాను వెనక్కు తగ్గేదే లేదని చెబుతున్నారు.
తాజాగా మంగళవారం అసెంబ్లీ సమావేశాలకు వచ్చిన సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడిన దానం… హైడ్రా విషయంలో తన వైఖరిలో ఎలాంటి మార్పు లేదన్నారు. తన అనుమతి లేకుండా తన పరిధిలో హైడ్రా చర్యలకు దిగితే సహించేది లేదని ఆయన తేల్చి చెప్పారు ఈ విషయంలో తాను ఎంత దూరం వెళ్లడానికి అయినా సిద్ధమేనని కూడా ఆయన వ్యాఖ్యానించారు. హైడ్రా విషయంలో ప్రభుత్వం తనపై చర్యలకు దిగినా కూడా భయపడేది లేదని కూడా దానం సంచలన కామెంట్ చేశారు.
ఇదిల ా ఉంటే… ఇంత మొండి పట్టు ఎందుకు అని మీడియా ప్రశ్నించగా,… దానం నుంచి ఆసక్తికర సమాదానం వచ్చింది. తాను దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి వద్దే తగ్గలేదని చెప్పారు. వైఎస్ వద్దే తగ్గని తాను ఇప్పుడు తగ్గుతానా? అంటూ ఆయన ఎదరు ప్రశ్నించారు. వైఎస్ తో పాటు బీఆర్ఎస్ అదినేత కేసీఆర్ అన్నా తనకు అభిమానమని చెప్పిన దానం… వారిద్దరి ఫొటోలను తన కార్యాలయంలో కొనసాగిస్తానని తెలిపారు. తన అభిమాన నేతల ఫొటోల విషయంలో రాజీ పడబోనని కూడా ఆయన చెప్పారు.
దానం నాగేందర్ రాజకీయ ప్రస్థానం నిజంగానే ఆసక్తికరంగా సాగింది. వైఎస్ కు అత్యంత సన్నిహితుడిగా సాగిన ఆయన…2004 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ లో తనకు టికెట్ దక్కకపోగా… వైఎస్ ఉండగానే టీడీపీలో చేరిపోయారు. అయితే ఎన్నికల్లో వైఎస్ విజయం సాదించడంతో టీడీపీని వదిలి తిరిగి వైఎస్ చెంతన చేరారు. వైఎస్ బతికున్నంత వరకూ ఆయన వెంటే సాగిన దానం… ఆ తర్వాత కూడా కొంత కాలం పాటు కాంగ్రెస్ లోనే కొనసాగారు. మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు. దానం రాజకీయంగా పీక్ దశలో ఉండగా…రాష్ట్ర విభజన జరగడం, పరాజయం ఆయనను ఫేడవుట్ చేసింది. అయితే తిరిగి పుంజుకున్న దానం బీఆర్ఎస్ లో చేరి తిరిగి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే ఇప్పుడు తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆయన తిరిగీ కాంగ్రెస్ గూటికి చేరారు. ఎక్కడ ఉన్నా కూడా తనదైన శైలితో సాగే దానం ఏది మాట్లాడినా కూడా సంచలనమే అవుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates