ఏపీలో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా చోటుచేసుకుంటున్నాయి. రోజుకో కొత్త పరిణామం చోటుచేసుకుంటూ ఉండటంతో… రాజకీయం నిజంగానే రసవత్తరంగా మారిపోయింది. ఇలాంటి క్రమంలో మరో కీలక పరిణామం చోటచేసుకుంది. అసెంబ్లీ సమావేశాలకు వెళ్లరాదని ఇదివరకే నిర్ణయించుకున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లుగా సమాచారం. ఈ నిర్ణయంపై ఇప్పటిదాకా పెద్దగా ప్రకటనేమీ రాకున్నా.. అటు జగన్ అనుకూల వర్గాలు, ఇటు వ్చతిరేక వర్గాలు చేస్తున్న వ్యాఖ్యలను బట్టి చూస్తే… జగన్ అసెంబ్లీకి రావాలని నిర్ణయించుకున్న విషయం వాస్తవమేనని తేలిపోయింది.
మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో 151 సీట్ల నుంచి వైసీపీ ఒక్కసారిగా 11 సీట్లకు పడిపోయింది. 23 సీట్లతో ఉన్న టీడీపీ… బీజేపీ, జనసేనలతో కలిపి ఏకంగా 164 స్థానాలను దక్కించుకుని తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది. ఈ క్రమంలో ప్రదాన ప్రతిపక్ష హోదా తనకు ఇవ్వరని సాకు చెప్పిన జగన్… తనతో పాటు తన పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ సభకు రామని… ప్రజాక్షేత్రంలోనే తాము ఉంటామని, మీడియా ముందే అధికార పక్షాన్ని ఎండగడతామని తెలిపారు. అయితే కేవలం 11 సీట్లు మాత్రమే దక్కడంతో నామోషీగా జగన్ ఫీలవుతున్నారని, టీడీపీ నేతలు ఎక్కడ తనను హేళన చేస్తారోనన్న భయంతోనే జగన్ అసెంబ్లీకి రావడం లేదని సెటర్లు పడుతున్నాయి.
ఇలాంటి నేపథ్యంలో సోమవారం అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. సరైన అనుమతి లేకుండా 60 రోజులకు పైబడి సభకు రాని సభ్యులపై అనర్హత వేటు పడే ప్రమాదం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ లెక్కన జగన్ కూడా అనర్హుడిగా పదవిని కోల్పోతారని, ఆ వెంటనే పులివెందులకు ఉప ఎన్నిక తప్పదని చెప్పారు. ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. నిబంధనల పేరు చెప్పి జగన్ ను అనర్హుడిగా ప్రకటించేందుకు అధికార పక్షం వ్యూహాలు రచిస్తోందన్న విశ్లేషణలు సాగుతున్నాయి. ఇవే విశ్లేషణలు జగన్ ను డైలమాలో పడేశాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.
నిజంగానే అదికార పక్షం తనను డిస్ క్వాలిఫై చేస్తే.. పరిస్థితి మరింతగా దిగజారుతుందని భావిస్తున్న జగన్… ఇక సభకు వెళ్లాలని నిర్ణయించుకున్నారట. అదే సమయంలో ఎమ్మెల్యేగా ఎన్నికై ఎన్నాళ్లు సభకు దూరంగా ఉంటారని ఇటు పార్టీ నేతలు, అటు ప్రజలు తనవైపు చూస్తున్నారన్న భావనలు కూడా జగన్ నిర్ణయంలో మార్పుకు దారి తీశాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. పదవి పోతుందన్న భయమో, పార్టీ వర్గాలు, ప్రజల్లో విశ్వాసం నెలకొల్పుదామన్న బాధ్యతో.. కారణం ఏదైనా కూడా అసెంబ్లీకి వెళ్లాని జగన్ తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం అవుతోంది. చూద్దాం…మరి ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్న ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఏం జరుగుతుందో.
Gulte Telugu Telugu Political and Movie News Updates