కాంగ్రెస్ పార్టీ మాజీ అద్యక్షురాలు, రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ పీకల్లోతు చిక్కుల్లో పడిపోయారని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీకి అత్యధిక కాలం పాటు అధ్యక్షురాలిగా వ్యవహరించి రికార్డులకెక్కిన సోనియా గాంధీపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు జారీ అయ్యాయి. అధికార పక్షం బీజేపీకి చెందిన 40 మంది ఎంపీలు మూకుమ్మడిగా ఆమెపై ఈ నోటీసులను ప్రతిపాదించారు. ఈ నోటీసుల ఆదారంగా సోనియాపై రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న అంశంపై ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి.
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్మ ప్రసంగం చేశారు. ఈ ప్రసంగంపై సోనియా గాంధీ ఘాటుగా స్పందించారు. ఎన్డీఏ సర్కారు రాసి ఇచ్చిన సుదీర్ఘ ప్రసంగాన్ని చదివేందుకు ముర్ము నానా తిప్పలు పడ్డారని సోనియా గాంధీ వ్యంగ్యం ప్రదర్శించారు. అంతేకాకుండా ఒకే అంశాన్ని పదే పదే ప్రస్తావించిన ముర్ము ప్రసంగం సభ్యుల సహనాన్ని పరీక్షించేలా ఉందని కూడా ఆమె అన్నారు. ఈ వ్యాఖ్యలపై తొలుత రాష్ట్రపతి భవన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సోనియా వ్యాఖ్యలను నిరసిస్తూ ఓ ప్రకటనను కూడా విడుదల చేసింది.
తాజాగా సోనియా వ్యాఖ్యలపై బీజేపీ ఒకింత సీరియస్ గా స్పందించింది. దేశ ప్రథమ పౌరురాలిగా ఉన్న రాష్ట్రపతి ముర్ము ప్రతిష్ఠకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేస్తారా? అంటూ సోనియాపై బీజేపీ కస్సుమంది. రాజ్యసభ సభ్యురాలిగా ఉండి కూడా రాష్ట్రపతి గౌరవ మర్యాదలపై అవగాహన లేకుండా ప్రవర్తించిన సోనియా సభా హక్కులను ఉల్లంఘించినట్టేనని బీజేపీ ఆరోపించింది. ఈ క్రమంలో సోనియాపై చర్యలు తీసుకోవాలంటూ రాజ్యసభ చైర్మన్ కు 40 మంది బీజేపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే… రాష్ట్రపతి ప్రసంగం బోరింగ్ అంటూ బహిరంగ వ్యాఖ్యలు చేసిన తన కుమారుడు రాహుల్ గాంధీని వారించి సారీ చెప్పించిన సోనియా… ఇప్పుడు తాను ఈ వివాదంలో చిక్కుకోవడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates