అయ్యన్నపెద్ద సమస్యలోనే చిక్కుకున్నారే!

టీడీపీ సీనియర్ మోస్ట్ నేత, ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు… నిత్యం వివాదాలతోనే సహవాసం చేస్తున్నట్లుగా ఉంది. యంగ్ ఏజ్ లో ఉండగా… పార్టీ నియమావళికి కంకణబద్ధులై సాగిన అయ్యన్న… వయసు మీద పడినంతనే…ఒకింత కట్టు తప్పిపోతున్నారన్న వాదనలు లేకపోలేదు ప్రస్తుతం ఆయన రాజ్యాంగబద్ధమైన శాసన సభాపతి స్థానంలో ఉన్నారు. అయినప్పటికీ ఆయన తాజాగా ఓ వివాదంలో చిక్యుకున్నారు.

స్పీకర్ హోదాలో తన జిల్లా పరిధిలో పర్యటకాభివృద్ధి కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయనను ఇబ్బందుల్లోకి నెట్టేశాయని చెప్పాలి. రాష్ట్రంలో… ప్రత్యేకించి సముద్ర తీరంతో అలరారుతున్న తన జిల్లాలో పర్యాటక రంగం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లాలని ఆయన ఆశిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఓ మాట అన్నారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు అవసరమైతే…గిరిజనుల ఉనికికి భరోసా కల్పిస్తున్న 1/70 చట్టానికి సవరణలు చేయాలని ఆయన ఓ నాలుగు రోజుల క్రితం వ్యాఖ్యానించారు.

అయ్యన్న వ్యాఖ్యలను గిరిజనులు ఒకింత సీరియస్ గానే తీసుకున్నట్లుంది. అయ్యన్న వ్యాఖ్యలకు నిరసనగా… ఈ నెల 12న మన్యం ప్రాంతాల బంద్ కు పిలుపునిచ్చారు. వాస్తవానికి ఓ బీసీ సామాజిక వర్గానికి చెందిన అయ్యన్న అణగారిన వర్గాలను కించపరిచేలా, వారి హక్కులకు భంగం వాటిల్లేలా ప్రవర్తించిన దాఖలా గతంలో ఎన్నడూ లేదనే చెప్పాలి. తన రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేసిన సమయాల్లోనే ఆయన ఒకింత ఘాటు వ్యాఖ్యలు చేస్తారు తప్పించి… ఇలా ఓ వర్గాన్ని కించపరిచేలా… ప్రత్యేకించి గిరిజనుల హక్కులకు భంగం కలిగేలా వ్యవహరించే నేత కాదనే చెప్పాలి. ఏ కాంటెక్ట్స్ లో అన్నా అయ్యన్న వ్యాఖ్యలు అయితే గిరిజనులను నొప్పించాయి. మరి వారి నిరసనలను నిలిపే దిశగా అయ్యన్న ఏమైనా చర్యలు తీసుకుంటారేమో చూడాలి.