వైసీపీ అధినేత జగన్ తన బ్రిటన్ పర్యటన ముగించుకుని చాలా రోజుల తర్వాత ఏపీకి వస్తున్నారు. వాస్తవానికి ఆయన నాలుగు రోజుల కిందటే బ్రిటన్ పర్యటన ముగించుకున్నారు. అక్కడ నుంచి నేరుగా బెంగళూరు ప్యాలస్‌కు చేరుకున్నారు. విశ్రాంతి అనంతరం.. తాజాగా సోమవారం తాడేపల్లికి చేరుకుంటారు. ఈ నేపథ్యంలో వైసీపీలో భారీ ఎత్తున జోష్ కనిపిస్తుందని అందరూ అనుకుంటారు. మా నాయకుడొచ్చాడంటూ.. పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటారని కూడా భావిస్తారు. కానీ, అలాంటిదేమీ లేకుండానే నాయకులు చూచాయగానే స్పందించే పరిస్థితి కనిపిస్తోంది.
ఒకప్పుడు జగన్ ఎక్కడకు వెళ్లినా..ఎక్కడ నుంచి వచ్చినా మందీ మార్బలం భారీ ఎత్తున స్వాగతం పలికేది. అదేవిధంగా ఆయనకు భారీ ఎత్తున మర్యాదలు కూడా దక్కేవి. కానీ, 11 స్థానాలకు పరిమితమైన తర్వాత ఈ మార్యాదలు తగ్గుతూ వచ్చాయి. ఘోర పరాజయం నుంచి పార్టీ నేతలు.. తేరుకోలేక పోవడం, ఈ మొత్తం ఓటమికి జగన్ వ్యూహాత్మక తప్పిదమే కారణమని వారు భావిస్తున్న క్రమంలో నాయకుల్లో అసంతృప్తి సెగలు రగులుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే జగన్ వస్తున్నారంటే.. ఒకప్పుడు ఉన్న జోష్ ఇప్పుడు కనిపించడం లేదు. ఒకప్పుడు ఉన్న గౌరవ మర్యాదలు కూడా కనిపించడం లేదు.
బ్రిటన్ పర్యటనకు ముందు.. కడప జిల్లాకు వెళ్లిన జగన్‌కు.. అక్కడ సీనియర్ నేతల నుంచి ఎలాంటి గౌరవం దక్కిందో అందరికీ తెలిసింది. వారి రాకకోసం ఆయన ఎదురు చూసే పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు.. చిన్నా చితకా నాయకులు, అసలు జగన్ ముందు నిలబడేందుకు కూడా ఇబ్బంది పడే కార్యకర్తలే ఆ రోజు పెద్ద నేతలుగా చలామణి అయ్యారంటే.. పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవచ్చు. ఓటమికి తోడు.. ఎలాంటి వ్యూహం లేకుండా గత 7 మాసాలుగా సాగుతున్న ప్రయాణం.. పార్టీలో పెరుగుతు న్న అసంతృప్తులను తగ్గించలేక పోవడం.. వంటివి కూడా జగన్ ఇమేజ్ విషయంలో సొంత పార్టీ నాయకులే తక్కువ చేస్తున్న పరిస్థితి ఉంది.
అదే.. ఇప్పుడు కూడా కనిపిస్తోంది. జగన్ ఎంట్రీ ఇస్తున్నారంటే.. తాడేపల్లిలోని పెద్దలు కూడా కిమ్మనకుండా కూర్చున్నారు. వస్తే రానీ.. అన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు. ఒకప్పటి నుంచి ఇప్పటి వరకు.. వైసీపీ వ్యవహారాలను గమనిస్తే.. జగన్‌కు ఇచ్చిన, ప్రస్తుతం ఇస్తున్న మర్యాదల్లో స్పష్టమైన తేడా కనిపిస్తోంది. ఒకప్పుడు ఆయన ముందు నిలబడేందుకు క్యూ కట్టిన నాయకులు కూడా ఇప్పుడు లైట్ తీసుకుంటున్నారు. ఒకప్పుడు జగన్ దర్శనం కోసం అల్లాడిన వారు కూడా ఇప్పుడు ఆయనకు కనిపించడమే లేదు. సో.. ఇదీ ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ పరిస్థితి!!
Gulte Telugu Telugu Political and Movie News Updates