వైసీపీ పాలనలో ఏపీలో భూముల అన్యాక్రాంతం యథేచ్చగా సాగిందన్న ఆరోపణలు ఒకింత గట్టిగానే వినిపించాయి. ఇప్పుడు టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన మొదలయ్యాక సదరు అక్రమాలన్నీ ఒక్కొక్కటిగానే బయటకు వస్తున్నాయి. ఫలితంగా ఏపీలో తమది కాని భూమి వైపు కన్నెత్తి చూడాలంటేనే భయపడిపోయే పరిస్థితి నెలకొంది. అలాంటిది టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు పేరిట ఉన్న భూమినే కొట్టేసేందుకే కొందరు యత్నించిన ఘటన ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
టీడీపీ శ్రేణులతో పాటు కూటమి పార్టీల శ్రేణులను షాక్ కు గురి చేసే ఈ ఘటన బాపట్లలో వెలుగు చూసింది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే… ఎప్పుడో 25 ఏళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రానికి చంద్రబాబు సీఎంగా ఉండగా… పార్టీ మీద, చంద్రబాబు మీద అమితమైన అబిమానం కలిగిన ఓ టీడీపీ కార్యకర్త… బాపట్లలో పార్టీ కార్యాలయం కోసం 9.5 సెంట్లను కొనుగోలు చేశారు. దానిని ఆ కార్యకర్త చంద్రబాబు పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. ఆ స్థలంలో పార్టీ కార్యాలయం కట్టేందుకు స్థానిక నేతలు ఎప్పటికప్పుడు ఆలోచిస్తున్నా.. ఏదో ఒక కారణంతో వాయిదా పడుతూ వస్తోంది. ఈలోగా ఆ స్థలం విలువ కాస్తా… రూ.1.5 కోట్లకు చేరింది.
ఈ క్రమంలో అక్రమ భూదందాలకు అలవాటు పడ్డ కొందరు వ్యక్తులు ఎవరూ పట్టించుకోవట్టేదని భావించారో, ఏమో తెలియదు గానీ… ఆ భూమికి సంబంధించి నకిలీ పత్రాలను సృష్టించారు. ఇంకేముంది… ఆ పత్రాలతో చంద్రబాబు పేరిట ఉన్న భూమిని అమ్మేసి సొమ్ము చేసుకుందామని భావించారు. కొనుగోలుదారుడిని కూడా రెడీ చేశారు. అక్రమార్కుల మాయలో పడి కొనుగోలుదారుడు డబ్బు చెల్లించి ఆ భూమిని కొనేందుకు రెడీ అయిపోయాడు కూడా. ఈ క్రమంలో నకిలీ పత్రాలతో వారంతా రిజిస్ట్రార్ ఆఫీస్ కు వెళ్లగా… ఆ పత్రాలను చూసిన అధికారులు అసలు విషయాన్ని గుర్తించారు. ఇది చంద్రబాబు పేరిట ఉన్న భూమి కదా అని చెప్పగా… కొనుగోలుదారుడు షాక్ తిన్నాడట. సమాచారం అందుకున్న పోలీసులు… ఈ తతంగాన్ని నడిపించిన సత్తార్ రెడ్డి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.