వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం పుంగనూరులో ఆదివారం జరిగిన జనసేన బహిరంగ సభ సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. పుంగనూరు పరిధిలోని సోమల మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్ ప్రాంగణంలో జరిగిన ఈ సభకు జన సైనికులు భారీ సంఖ్యలోనే తరలివచ్చారు. జనసైనికుల నినాదాలతో సోమల మారుమోగిపోయింది. ఈ సభతో పుంగనూరులోనే కాకుండా ఆ పరిసర నియోజకవర్గాల జనసైనికులకు కూడా మంచి జోష్ ను నింపిందనే చెప్పాలి.
ఇక ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన జనసేన ప్రధాన కార్యదర్శి నాగేంద్ర బాబు పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపేందుకు ప్రయత్నించారు. అందులో భాగంగా ఆయన పెద్దిరెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు పెద్దిరెడ్డి అంటే… అందరూ భయపడతారని, మీరు కూడా కాస్తంత జాగ్రత్త అని చాలా మంది తనకూ చెప్పారన్న నాగబాబు… పెద్దిరెడ్డికి భయపడేది లేదని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఓ సినిమాటిక్ డైలాగ్ ను పేల్చారు. పెద్దిరెడ్డి అయినా… సుబ్బారెడ్డి అయినా… పిచ్చిరెడ్డి అయినా డోంట్ కేర్ అంటూ నాగబాబు పంచ్ డైలాగ్ సంధించారు.
ఇక అటవీ భూములతో పాటు అడవుల్లోని సహజ సంపదను దోచుకున్న పెద్దిరెడ్డి ముమ్మాటికీ అడవి దొంగేనని నాగబాబు సంచలన వ్యాఖ్య చేశారు. వైసీపీ జమానాలో తప్పు చేసిన వారిని వదిలిపెట్టేది లేదన్న నాగబాబు.. పెద్దిరెడ్డి అక్రమాలను కూడా సహించేది లేదని తేల్చి చెప్పారు. పెద్దిరెడ్డి భూ ఆక్రమణలపై విచారణ జరిపి.. కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మొత్తంగా పవన్ రేంజిలో కాకపోయినా.. జనసేన శ్రేణులను నాగబాబు కొత్త ఉత్సాహాన్ని నింపారని చెప్పాలి.