ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చుట్టూ బీజేపీకి చెందిన హేమాహేమీలు ఉంటారు. దాదాపుగా వారంతా ఉత్తరాదికి చెందిన వారే. దక్షిణాదికి చెందిన నేతలు మోదీ నీడలో ఎదగడం అంటే… నూటికో, కోటికో ఒక్కరు అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు రాజకీయాల నుంచి తప్పుకున్నాక.. దక్షిణాదికి చెందిన బడా నేత ఢిల్లీలోనే లేరనే చెప్పాలి. అందులోనే మోదీ కోటరీ సౌత్ నేతలను అంతగా దగ్గరకు కూడా రానివ్వట్లేదు. అయితేనేం… మోదీ ప్రధాని అయినప్పటి నుంచి ఆయన కేబినెట్ లో తప్పనిసరిగా కనిపిస్తున్న ముఖం ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దే.
తమిళనాడుకు చెందిన నిర్మలమ్మ… ఏపీకి చెందిన రిటైర్డ్ పొలిటీషియన్ పరకాల ప్రభాకర్ ను వివాహం చేసుకున్నారు. ఈ లెక్కన ఎటు చూసినా నిర్మలమ్మకు మోదీ వద్ద పరపతి లేదనే చెప్పాలి. అయితే అప్పటికే బీజేపీలో ఓ స్థాయికి ఎదిగి ఉండటం, సత్తా కలిగిన మహిళలు కరువైన నేపథ్యంలో మోదీ ప్రదాని కాగానే… ఆయన కేబినెట్ లో నిర్మలకు చోటు దక్కింది. అయితే ఆ స్థానాన్ని అలాగే కాపాడుకోవడం అనేది కత్తి మీద సాము లాంటిదే. ఉత్తరాది లాబీని తట్టుకుని నిర్మలమ్మ… మోదీ కేబినెట్ లో కొనసాగుతూ ఏ ఒక్కరికి సాధ్యం కాని రికార్డులను సొంతం చేసుకుంటూ సాగుతున్నారు.
ఇలాంటి ఆశ్చర్యగొలిపే ప్రస్థానం వెనుక నిర్మలమ్మ సింప్లిసిటీనే కారణమని చెప్పాలి. ఎందుకంటే… సర్పంచ్, కార్పోరేటర్ అంటేనే… రేంజ్ రోవర్లు, బీఎండబ్ల్యూలు, ఆడిలు… ఇలా డాబూదర్పం ప్రదర్శిస్తున్న ఈ కాలంలో దేశానికి ఆర్థిక మంత్రిగా ఉన్న నిర్మలమ్మ ఇప్పటికీ మారుతి కారులోనే ప్రయాణిస్తున్నారు. మూడు కార్లు ఉండే నిర్మల కాన్వాయ్ లో ఆ మూడు కూడా మారుతి సెడాన్లే ఉన్నాయి. శనివారం వరుసబెట్టి 8వ సారి కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన తర్వాత పార్లమెంటు నుంచి వడివడిగా బయటకు వచ్చిన నిర్మల… తన మారుతి సెడాన్ కారు ఎక్కి దూసుకుపోయారు. ఈ సింప్లిసిటీనే ఆమెను మోదీకి తగిన ఆర్థిక మంత్రిగా నిలబెట్టిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.