కోటి తీసుకుంటే.. సూటుతోనే రావాలా?

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శనివారం రాయచోటిలో జరిపిన పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న ఓ ఘటనపై సోషల్ మీడియాలో సెటైర్ల మీద సెటైర్లు పడ్డాయి. వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు అయితే నవ్వినవ్వి చస్తే బాధ్యత మాది కాదు అంటూ మరింతగా పేట్రేగిపోయారు. ఆ ట్రోలింగ్ కు రాయచోటికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ యువరాజు యాదవ్ అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. అంతేకాకుండా ఆయన తనదైన సమాధానంతో ట్రోలర్ల నోళ్లకు ఇట్టే తాళం వేసి పారేశారు.

చంద్రబాబు తన టూర్ లో భాగంగా అక్కడి సాఫ్ట్ వేర్ ఇంజనీర్లతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా యువరాజు యాదవ్ మాట్లాడుతూ తానో సాఫ్ట్ వేర్ ఉద్యోగినని, ఏడాదికి రూ.93 లక్షల వేతనాన్ని తీసుకుంటున్నానని, ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం పద్దతిన ఇంటి వద్ద ,నుంచే పనిచేస్తున్నానని చెప్పారు. ఈ వీడయో అలా ప్రసారమైందో, లేదో.. సోషల్ మీడియాలో ఇలా ట్రోలింగ్ షురూ అయిపోయింది. ఆ కంపెనీ పేరు ఏమిటో చెబితే మేమూ చేరిపోతామని కొందరంటే… బెంగళూరులో ఆ స్థాయిలో వేతనాలు ఇస్తున్నారా? అంటూ మరికొందరు వ్యంగ్యం ప్రదర్శించారు. ఈ ట్రోలింగ్ ను అంతా ఓపిగ్గానే విన్న యాదవ్.. తీరిగ్గా తన రిప్లైని పోస్ట్ చేసి ట్రోలర్లు అందిరికీ షాకిచ్చారు.

యువరాజు యాదవ్ తన స్పందనను ఓ వీడియో రూపంలో చిత్రీకరించి దానిని సోషల్ మీడియాలో పెట్టారు. ఈ సందర్భంగా కంపెనీ పేరును మాత్రం వెల్లడించలేనని చెప్పిన యాదవ్… తన శాలరీ స్లిప్పులతో పాటు తాను కడుతున్న ఐటీకి సంబందించిన ఆధారాలను బయటపెట్టారు. “రూ.93 లక్షలని చెప్పిన నా వేతనం వాస్తవానికి రూ.96 లక్షలు. కేవలం నాలుగు లక్షలు తక్కువ అక్షరాలా కోటి రూపాయలు. అందులో డిడక్షన్ ను తొలగించి రూ.83 లక్షలు అని చెప్పాను.అయినా నా శాలరీపై పడి ఏడవడం కాదు. వాస్తవాలు తెలుసుకోండి. చదువు ఎవడబ్బ సొత్తు కాదు. కోటి జీతం తీసుకుంటే సూటు బూటు వేసుకునే రావాలా?” అంటూ ఓ రేంజిలో విరుచుకుపడ్డారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.