టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుది పాలనలో ఎప్పుడూ ప్రత్యేక శైలే. అందరికీ ఆదర్శప్రాయమైన నిర్ణయాలు తీసుకునే చంద్రబాబు…ప్రజా ధనం దుబారా అంటే అస్సలు ఒప్పుకోరు. అదికారం చేతికి వచ్చింది కదా అని పాలనలో అనుభవం లేకున్నా… తన వారు కదా అంటూ ఏ ఒక్కరికి కూడా పదవులు కట్టబెట్టరు. బాబు జమానాలో అడ్డైజర్లు పెద్దగా కనిపించరు. ఒకవేళ అలా అడ్వైజర్లు అంటూ కనిపిస్తే… వారు ఎంతో నిష్ణాతులే అయి ఉంటారు. నిజమే.. గతంలో ఏపీకి డీజీపీగా పని చేసి రిటైర్ అయిన మాజీ ఐపీఎస్ అదికారి ఆర్పీ ఠాకూర్ ఇప్పుడు ఏపీ ప్రభుత్వంలో సలహాదారుగా నియమితులు అయ్యారు.
ఏపీ సీఎం చంద్రబాబు… ఆర్పీని అడ్వైజర్ గా నియమిస్తూ శనివారం కీలక నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ జమానాలో రాజకీయ కక్షలకు బలైపోయిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించిన చంద్రబాబు… ఆర్పీని సర్కారీ సలహాదారుగా నియమించారు. ఈ మేరకు ఏబీవీతో పాటుగా ఆర్పీ ఠాకూర్ కు సంబంధించిన నియామక ఉత్తర్వులను వేర్వేరుగా జారీ చేయ్యాయి. ఢిల్లీలోని ఏపీ భవన్ కేంద్రంగా ఠాకూర్ విధులు నిర్వర్తించనున్నారు. అంటే.. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన వారదిగా వ్యవహరించనున్నారన్న మాట.
ఐపీఎస్ అధికారిగా ఏబీవీకి మాదిరిగానే ఆర్పీకి కూడా సత్తా కలిగిన అధికారిగా గుర్తింపు ఉంది. ఈ కారణంగానే చంద్రబాబు హయాంలో ఆర్పీకి డీజీపీగా అవకాశం దక్కింది. ఠాకూర్ డీజీపీగా ఉన్న సమయంలో ఏబీవీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేశారు. ఠాకూర్ డీజీపీగా ఉన్న సమయంలో పోలీసులకు కూడా వీక్లీ ఆఫ్ దిశగా కీలక అడుగులు పడ్డాయి. పోలీసు శాఖలో పలు కీలక సంస్కరణలకు కూడా ఆర్పీ శ్రీకారం చుట్టారు. ఈ లెక్కన పాలనా వ్యవహారాల్లో ఠాకూర్ ఘనాపాటి అనే చెప్పాలి. ఈ కారణంగానే రిటైర్ అయినా కూడా ఆయన సేవలను వినియోగించుకునేందుకు చంద్రబాబు మొగ్గు చూపారన్న వాదనలు వినిపిస్తున్నాయి.