అవును.. అచ్చెన్నాయుడికే టీడీపీ పగ్గాలు

అనుకున్నదే జరిగింది. కొన్ని రోజులుగా ప్రచారంలో ఉన్న విషయమే నిజమైంది. ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ పగ్గాలను ఆ పార్టీ సీనియర్ నేత అచ్చెన్నాయుడికి అప్పగించారు. ఆయన్న ఏపీ తెలుగుదేశం అధ్యక్షుడిగా నియమించినట్లు పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇక టీడీపీ పొలిట్ బ్యూరోలోకి మొత్తం 24 మందిని సభ్యులుగా చేర్చుకున్నారు.

తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఎల్ రమణనే కొనసాగిస్తూ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. వివిధ కమిటీలను కూడా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. 27 మంది సభ్యులతో సెంట్రల్ కమిటీని ఏర్పాటు చేశారు.

తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయాక చంద్రబాబు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మారి.. రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా అధ్యక్షులను నియమించిన సంగతి తెలిసిందే. తెలంగాణ బాధ్యతలను అప్పట్నుంచి రమణే చూస్తుండగా.. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా కళా వెంకట్రావు ఉన్నారు. ఐతే గత ఎన్నికల్లో ఓటమి తర్వాత కళా వెంకట్రావు అంత చురుగ్గా లేరు. ఇక కొన్ని నెలల కిందట మందుల కొనుగోలుకు సంబంధించి అక్రమాల్లో భాగమయ్యారంటూ అచ్చెన్నాయుడిని వైకాపా సర్కారు అరెస్టు చేసింది. దీని మీద రాజకీయంగా పెద్ద రగడే నడిచింది. అచ్చెన్నాయుడి కోసం టీడీపీ గట్టిగానే పోరాడింది. ఆయనకు అండగా నిలిచింది.

అచ్చెన్నాయుడిపై ప్రస్తుతం జనాల్లో సానుభూతి ఉందన్న అభిప్రాయం టీడీపీలో ఉంది. అలాగే వైకాపాను బలంగా ఢీకొట్టడానికి, ఉత్తరాంధ్రలో పార్టీని బలోపేతం చేయడానికి అచ్చెన్నాయుడి లాంటి బలమైన నేత అవసరం ఉందని కూడా టీడీపీ భావిస్తోంది. అందుకే ఆయన్ని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా చేయాలని చంద్రబాబు నిర్ణయించినట్లు చాలా రోజుల ముందే వార్తలు వచ్చాయి. ఇప్పుడు వాటిని నిజం చేస్తూ అచ్చెన్నను అధికారికంగా ఏపీ అధ్యక్షుడిగా ప్రకటించారు.