రాష్ట్రంలో కూటమి సర్కారు ఏర్పడి ఏడు మాసాలు పూర్తయిన దరిమిలా.. చంద్రబాబు తమ ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న సంతృప్తి, అసంతృప్తి లెక్కలు వేసుకున్నారు. దీనిలో పథకాలు, కార్యక్రమాలు, అభివృద్ధి పేరుతో విభజించారు. ఇలానే వైసీపీ కూడా విపక్షంగా ఏడు మాసాలు పూర్తి చేసుకుంది. దీంతో ఈ ఏడు మాసాల కాలంలో వైసీపీకి ఎన్ని మార్కులు పడ్డాయి? అనేది ప్రశ్న. వాస్తవానికి ఈ ఏడు మాసాల కాలంలో విపక్షానికి పెద్దగా పనిలేకుండా పోయింది.
అసెంబ్లీకి హాజరు కాకపోవడంతో వైసీపీ పాత్రను కూడా టీడీపీ నేతలే ఏయడం గమనార్హం. దీంతో వైసీపీపై పెద్దగా చర్చ లేకుండాపోయింది. ఇక, జగన్ ఉంటేనే పార్టీ గురించిన కదలిక.. లేదా చర్చ ఉంటోంది. జగన్ లేకపోతే.. పార్టీ గురించి మాట్లాడే వారే కనిపించరు. తాజాగా కూడా అదే జరిగింది. జగన్ లండన్‌కు వెళ్లడంతో పార్టీలో నిశ్శబ్దత చోటు చేసుకుంది. ఫిబ్రవరి నుంచి ప్రజల మధ్యకు వస్తానని జగన్ ఇప్పటికే చెప్పారు. అయితే.. ఆయన ఎప్పటి నుంచి వస్తారో కూడా క్లారిటీ లేదు.
అయినప్పటికీ.. ప్రజాపోరాటాలు చేయొచ్చు. కానీ.. ఇప్పటి వరకు జగన్ పోరు బాట పట్టలేదు. తాజాగా మాత్రం ఫిబ్రవరి 5వ తేదీ నుంచి విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంటు కోరుతూ ధర్నాలు చేయాలని పిలుపు నిచ్చారు. దీనికి కూడా జగన్ వస్తారో లేదో డౌటే. ఎందుకంటే.. ఇప్పటి వరకు చేసిన రెండు ధర్నా లకు కూడా కేవలం నాయకులు, కార్యకర్తలనే పంపించిన జగన్.. తాను మాత్రం తాడేపల్లి, బెంగళూరు ల్లోనే ఉండిపోయారు.
దీంతో ప్రతిపక్ష నాయకుడిగా జగన్‌కు ఇప్పటి వరకు ఆశించిన మేరకు మార్కులు అయితే పడలేదని అంటున్నారు. ఇక నుంచి ఆయనలో వచ్చే మార్పు.. ఆయన తీసుకునే లైన్, చేసే పనులను బట్టే ఉంటుంది. కాబట్టి కేవలం నాయకులను కార్యకర్తలను మాత్రమే నడిపించడం కాకుండా.. జగనేనేరుగా రంగంలోకి దిగితే అది భారీ ఎత్తున ఫోకస్ అవుతుంది. లేకపోతే.. కేవలం నాయకులే కనిపిస్తే.. ప్రయోజనం పెద్దగా ఉండదని అంటున్నారు పరిశీలకులు.