ఈ ఎమ్మెల్యే నిజంగానే ‘వెండి’ కొండ

జనంపల్లి అనిరుధ్ రెడ్డి… ఈ పేరు గడచిన రెండు, మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఈ రెడ్డి గారు.. 2023లో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో రాజకీయ రంగప్రవేశం చేశారు. వచ్చీరావడంతోనే రాజకీయాల్లో కాకలు తీరిన మాజీ మంత్రి లక్ష్మారెడ్డిని చిత్తు చేసి పాలిటిక్స్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల అసెంబ్లీ నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

అయినా ఇప్పుడు ఈ రెడ్డిగారి పేరు వైరల్ కావడానికి కారణమేమిటంటే… తన పడక గదిని ఈయన గారు వెండితో నింపేశారు. అంటే ఏదో అక్రమంగా సంపాదించిన వెండిని దాచేశారని కాదు. వెండితో తాపడం చేసిన వస్తువులతో ఆయన తన పడక గదిని నింపేశారు. అనిరుధ్ బెడ్ రూంలోకి అడుగు పెట్టినంతనే… సోఫా సెట్, దాని ఎదురుగా కనిపించే మరికొన్ని కుర్చీలు, నిలువెత్తు అద్దాలు… చివరాఖరుకు బెడ్ ను కూడా ఆయన వెండితోనే తాపడం చేయించారు. వెరసి అనిరుధ్ పడక గది వెండితో వెలిగిపోతోంది.

ఇలా ఎందుకు రెడ్డిగారూ అంటే… తాను పడక గదిలోకి అడుగు పెడితేనే ఆ ఫీల్… అంటే వెండి ఫీల్ రావాలని ఆయన ఆసక్తికరమైన సమాదానం ఇచ్చారు. బెడ్ రూం అంటే ఎవరికైనా ప్రత్యేకమేనని చెప్పక తప్పదు.ఇక సంపన్నుల విషయంలో అయితే అది మరింత ప్రత్యేుకమనే చెప్పాలి. అందుకే కాబోలు అనిరుధ్ తన అబిరుచులకు అనుగుణంగా తన బెడ్ రూంను ఇలా వెండితో నింపేశారన్న మాట. ఈ వెండి శోబితానికి అయిన ఖర్చును మాత్రం ఆయన వెల్లడించలేదు.

కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ పట్టభద్రుడైన అనిరుధ్.. హైదరాబాద్ లోని జేఎన్టీయూలో చదివారు. ఆ తర్వాత.చాలాకాలం పాటు కొలువు చేసి ఇటీవలే రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లోనూ తనదైన మార్కును చూపిస్తున్న అనిరుధ్…ఇటీవలే తనకు పోలీస్ సెక్యూరిటీ అవసరం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలే పోలీసు బలగాల సంఖ్య తక్కువగా ఉన్న నేపథ్యంలో తనకు సెక్యూరిటీ ఎందుకు అంటూ ఆయన నేరుగా జిల్లా ఎస్పీకే తెలిపారట. ఈ లెక్కన ఈ విషయంలోనూ అనిరుద్… వెండి కొండే కాదు బంగారు కొండ కూడా అని చెప్పాలి.