ఏపీలో రాజకీయం అంతకంతకూ రసవత్తరంగా మారుతోంది. మొన్నటి ఎన్నికల్లో అందరి అంచనాలు తలకిందులు కాగా… ఆ విస్తుగొలిపే ఫలితాలకు అనుగుణంగానే రాజకీయంగానూ పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న పుంగనూరులో కూటమి భాగస్వామ్య పార్టీ జనసేన రేపు ఓ భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. పుంగనూరు పరిధిలోని సోమలలో ఈ సభకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.
పెద్దిరెడ్డికి గట్టి పట్టు ఉన్న పుంగనూరులో జరుగుతున్న ఈ సభకు జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరు కావడం లేదు. అయితే ఆయన తరఫున పార్టీ కీలక నేత, పవన్ సోదరుడు నాగేంద్ర బాబు స్వయంగా ఈ సభకు హాజరవుతున్నారు. నాగబాబుతో పాటుగా తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్న ఆరణి శ్రీనివాసులు, చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్, ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ లతో పాటు చిత్తూరు, తిరుపతి జిల్లాల పార్టీ కీలక నేతలు బారీ సంఖ్యలో పాలుపంచుంటున్నారు.
ఈ సభ ద్వారా పెద్దిరెడ్డి ఇలాకాలో జనసేనకు గ్రాండ్ ఎంట్రీ ఇప్పించాలన్నదే పవన్ లక్ష్యంగా కనిపిస్తోంది. ఇప్పటికే పుంగనూరులోనూ పార్టీ శ్రేణులు ఉన్నా… పెద్దిరెడ్డి వర్గం భయంతో అంతగా బయటకు రాలేకపోతున్నారన్న వాదనలు ఉన్నాయి. అంతేకాకుండా ఇటీవల పెద్దిరెడ్డి భూ ఆక్రమణలను పవన్ స్వయంగా బట్టబయలు చేయడంతో పాటుగా వాటిపై విచారణకు ఆదేశాలు జారీ అయ్యేలా చేశారు. దీంతో పెద్దిరెడ్డి ఆత్మ రక్షణలో పడిపోయారు. ఇలాంటి కీలక తరుణంలో తన ఇలాకాలో జనసేన భారీ బహిరంగ సభ అంటే పెద్దిరెడ్డికి ఇబ్బందేనని విశ్లేషణలు సాగుతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates