వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా చక్రం తిప్పిన నేతల్లో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఒకరు. పైకి సౌమ్యుడిలా కనిపిస్తారు కానీ.. చిత్తూరు జిల్లాలో ఆయన అరాచకాల గురించి కథలు కథలుగా చెబుతుంటారు. అధికారంలో ఉండగా పెద్దిరెడ్డిపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు వచ్చాయి. కానీ వాటినేమీ పట్టించుకోకుండా.. ఏం చేయాలనుకుంటే అది చేసుకుపోయారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం, మీడియా ఆయన అవినీతి సామ్రాజ్యాన్ని బట్టబయలు చేసే ప్రయత్నంలో ఉన్నాయి.
ఈ క్రమంలోనే అడవిని ఆక్రమించి కట్టిన భారీ ఫామ్ హౌస్, దానికి కిలోమీటర్ల కొద్దీ వేయించుకున్న రోడ్డుకు సంబంధించిన భాగోతం అంతా బయటికి వచ్చింది. అటవీ శాఖా మంత్రి అయిన పవన్ కళ్యాణ్.. పెద్ది రెడ్డి అవినీతి వ్యవహారాల మీద స్పెషల్ ఫోకస్ పెట్టారని.. ఫామ్ హౌస్ వ్యవహారంలో ఆయన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టేలా లేరని వార్తలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్ సహా పవన్ కళ్యాణ్ తన మీద చాలా ఆరోపణలు చేశారని, కానీ ఇప్పటిదాకా ఏం చర్యలు చేపట్టలేకపోయారని విమర్శించిన పెద్దిరెడ్డి.. ఫాం హౌస్ విషయంలో ఇచ్చిన వివరణ హైలైట్ అనే చెప్పాలి.
తమ భూముల్లో పని చేసే మనుషులు చాలామంది ఉన్నారని.. వాళ్లందరూ నివాసం ఉండడం కోసమే అటీవీ ప్రాంతంలో ఆ ఇల్లు కట్టించానని.. రోడ్డు కూడా వేయించానని.. చుట్టు పక్కల చెట్లు కూడా పెట్టించానని చెప్పారు పెద్దిరెడ్డి. ఐతే ఆ ఫాం హౌస్ వ్యవహారం చూస్తే మామూలుగా లేదు. అదో లగ్జరీ హౌస్ అని బయటి నుంచి చూస్తేనే స్పష్టంగా తెలుస్తోంది. పని వాళ్ల కోసం ఇంత పెద్ద ఇల్లు కట్టించి.. ప్రభుత్వ నిధులతో రోడ్డు కూడా వేయించడమంటే పెద్దిరెడ్డిది చాలా పెద్ద మనసని.. ఇలాంటి వ్యక్తి మీద ఆరోపణలు చేస్తారా అని వ్యంగ్యాస్త్రాలు వేస్తున్నారు నెటిజన్లు.
Gulte Telugu Telugu Political and Movie News Updates