గుమ్మనూరు జయరాం… కర్నూలు జిల్లా ఆలూరు ప్రాంతానికి చెందిన సీనియర్ రాజకీయ నేత. ఆదిలో కాంగ్రెస్ తో రాజకీయాలు మొదలుపెట్టిన ఈయన… ఆ తర్వాత వైసీపీతో కలిసి నడిచారు. జగన్ కేబినెట్ లో మంత్రిగానూ పనిచేశారు. 2024 ఎన్నికలకు కాస్తంత ముందుగా వైసీపీని వీడిన ఆయన టీడీపీలో చేరిపోయారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన జయరాంకు మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న నేపథ్యంలో ఏకంగా కర్నూలు జిల్లా నుంచి అనంతపురం జిల్లాలోని గుంతకల్లుకు మారినా…. ఎమ్మెల్యేగా గెలిచి నిలిచారు.
ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా, కూటమి పార్టీలకు చెందిన నేతగా సాగుతున్న జయరాం… మీడియాకు వార్నింగ్ లు ఇస్తూ కనిపించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. తన తప్పు ఉంటే తల వంచుతానని చెబుతూనే… తనపై అసత్యాలు రాస్తే మాత్రం మీడియా అని కూడా చూడనని ఆయన ఆయా సంస్థల మీడియా ప్రతినిధులను హెచ్చరించారు. అంతటితో ఆగని జయరాం… తానేదో గతంలో రైలు పట్టాలపై పడుకోబెట్టి హత్యలు చేసినట్లుగా మీడియానే చెప్పింది కదా… ఇప్పుడు కూడా అలా రైలు పట్టాలపై పడుకోబెట్టడానికి తనకేమీ అభ్యంతరం లేదని, తాను ఎవరికీ భయపడేది లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.
గుంతకల్లు నియోజకవర్గ పరిధిలో మిత్రపక్షాలైన బీజేపీ, జనసేన స్థానిక నేతలను వెంటేసుకుని గ్రామాల పర్యటనకు బయలుదేరిన సందర్భంగా బుధవారం ఉదయం జయరాం ఈ వ్యాఖ్యలు చేశారు. మీడయా ప్రతినిదులను హెచ్చరిస్తూ జయరాం సాగిపోతూ ఉంటే… ఆయన అనుచరులు, సోదరుడు అలా చూస్తుండిపోయారు. ఇదిలా ఉంటే వైసీపీ హయాంలో మంత్రిగా ఉన్నప్పుడు జయరాంపై లెక్కలేనన్ని ఆరోపణలు వచ్చాయి. అయితే ఎప్పుడు ఇలా ఆయన మీడియాను బెదిరించిన దాఖలా కనిపించలేదు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి కూడా జయరాం ఈ తరహాలో మీడియాపైనే బెదిరింపులకు దిగిన తీరుపై విమర్శలు రేగుతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates