వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుల కోసం దావోస్ వెళ్లిన కూటమి సర్కారు సింగిల్ పైసా పెట్టుబడులు కూడా రాబట్టలేదని విపక్షం వైసీపీ సెటర్లు వేస్తోంది. అంతేకాకుండా నయా పైసా పెట్టుబడి రాబట్టలేని దావోస్ సదస్సుకు ఎంత మేర ప్రజా ధనాన్ని ఖర్చు పెట్టారో చెప్పాలంటూ కూడా డిమాండ్ చేస్తోంది. ఈ విమర్శలు, డిమాండ్లకు స్పందించిన ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సోమవారం వైసీపీకి దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదికపై ప్రజెంటేషన్ ఇచ్చిన సందర్భంగా చంద్రబాబు ఈ రిప్లైని ఇచ్చారు.
చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కారు తన పాలనను మొదలుపెట్టి కేవలం 7 నెలలే అవుతోంది. అయితేనేం.. ఈ అతి స్వల్ప వ్యవధిలోనే రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.6,33,568 కోట్ల పెట్టుబడులను రాబట్టింది. ఈ పెట్టుబడులు 20 కంపెనీల నుంచి రాష్ట్రానికి వస్తున్నాయి. ఈ పెట్టుబడుదల ద్వారా ఏకంగా 4,10,125 ఉద్యోగాలు రాష్ట్ర యువతకు అందుబాటులోకి రానున్నాయి. కేవలం 7 నెలల వ్యవధిలోనే ఈ మేర పెట్టుబడులను రాబట్టడం అంటే… నిజంగానే గ్రేట్ అని చెప్పుకోవాలి. 7నెలల్లోనే ఈ మేర పెట్టుబడులు రాబడితే.. ఇక మిగిలిన నాలుగున్నరేళ్లలో ఇంకెంత మేర పెట్టుబడులను కూటమి సర్కారు తీసుకురానుందన్న విషయం ఇట్టే అర్థం కాక మానదు.
ఇక ఈ పెట్టుబడుల్లో అత్యధికంగా విశాఖలో ఏర్పాటు కానున్న ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు కోసం ఎన్టీపీసీ ఏకంగా రూ.1.85 లక్షల కోట్లను పెట్టుబడిగా పెట్టనుంది. ఆ తర్వాతి స్థానం ఆర్సెలర్ మిట్టల్ కంపెనీ (రూ.1.35 లక్షల కోట్లు), ఎన్ హెచ్ పీసీ (రూ.1 లక్ష కోట్లు) ఉన్నాయి. అంటే.. 20 కంపెనీలు రాష్ట్రానికి వస్తే… వాటిలో 3 కంపెనీలు ఒక్కో కంపెనీ ఏకంగా లక్ష కోట్ల కంటే అధిక మొత్తంలో పెట్టుబడులు పెడుతుండటం గమనార్హం. ఈ పెట్టుబడులన్నీ గ్రౌండ్ అయ్యేందుకు కొంత సమయం పట్టినా… ఈ పెట్టుబడులతో ఏర్పాటయ్యే యూనిట్లు గ్రౌండ్ అయితే ఏకంగా 4 లక్షలకు పైగా ఉద్యోగావకావాలు ఏపీ యువతకు అందనున్నాయి. అంటే… కూటమి ఇచ్చిన 20 లక్షల ఉద్యోగాల్లో కేవలం 7 నెలల్లోనే ఐదో వంతు ఉద్యోగాలను సాధించినట్టే కదా.
ఇవే విషయాలను తనదైన శైలి ప్రజెంటేషన్ ద్వారా వివరించిన చంద్రబాబు… 7 నెలల్లో రూ.6.3 లక్షల కోట్ల పెట్టుబడులను రాబట్టడం అంటే మాటలా? అని విపక్షాలను ఎదురు ప్రశ్నించారు. అయినా గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం ఏ రీతిన విధ్వంసం జరిగిందన్న దానిపై ఓ వైపు నీతి ఆయోగ్ లాంటి సంస్థలు పక్కా గణాంకాలతో కళ్లకు కట్టినట్టు చెబుతుంటే… వాటి నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని ఆయన మండిపడ్డారు. ఇంత విధ్వంసం జరిగిన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రారన్న చంద్రబాబు… తమ దక్షతను చూసే ఈ పెట్టుబడులు వచ్చాయని గుర్తు పెట్టుకోవాలని సూచించారు. మొత్తంగా వైసీపీ విమర్శలకు చంద్రబాబు ఓ రేంజి రీసౌండ్ వచ్చేలా స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు.