రఘురామ గుండెలపై కూర్చున్న వ్యక్తి దొరికేశాడట!

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజుపై సీఐడీ కస్టడీలో థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కేసుల్లో ఆదివారం కీలక పరిణామం చోటుచేసుకుంది. నాడు వైసీపీ తరఫున నరసాపురం ఎంపీగా గెలిచిన రఘురామ… ఆ తర్వాత వైసీపీకి దూరంగా జరిగారు. అంతేకాకుండా ఆ పార్టీ ప్రభుత్వం తీసుకుంటున్న పలు కీలక నిర్ణయాలపై ఆయన బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో ఆయనపై కేసు నమోదు చేసిన సీఐడీ అధికారులు… ఆయనను అరెస్ట్ చేసి… ఆపై తమ కస్టడీలోనే ఆయనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారనేది రఘురామ ప్రధాన ఆరోపణ.

ఏపీలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక ఈ కేసు దర్యాప్తు వేగం పుంజుకుంది. సీఐడీ కస్టడీలో ఉండగా… తనను హింసించారని, అంతేకాకుండా తన గుండెలపై ఓ బరువైన వ్యక్తిని కూర్చోబెట్టి తనకు ఊపిరి ఆడకుండా చేసి చంపేయాలని చూశారంటూ రఘురామ ఆరోపిస్తున్నారు. దీంతో రఘురామ చెప్పిన పలు ఆనవాళ్లను ఆధారం చేసుకుని పోలీసులు గుడివాడకు చెందిన కామేపల్లి తులసిబాబు అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అయితే నాడు తనను కొట్టిన వారితో పాటుగా తన గుండెలపై కూర్చున్న వ్యక్తి ముఖానికి మాస్కులు కట్టుకుని ఉన్నారని రఘురామ చెప్పారు.

ఈ క్రమంలో నిందితులను గుర్తించే కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా జడ్జి నేతృత్వంలో పోలీసులు చేపట్టారు. నిందితుల పరేడ్ కు రఘురామ స్వయంగా హాజరయ్యారు. జడ్జి సమక్షంలో ఆయన నిందతులను పరిశీలించి.. తనను కొట్టిన వారితో పాటుగా తన గుండెలపై కూర్చున్న బారీకాయుడిని గుర్తించారట. ఇదే విషయాన్ని ఆయన ఆ తర్వాత మీడియాతో చెప్పారు. ఈ కేసులో తనను అంతమొందించేందుకు యత్నించిన వ్యక్తులను గుర్తు పట్టి జడ్జికి చూపెట్టినట్లు ఆయన తెలిపారు. తనపై హత్యాయత్నానికి పాల్పడ్డ వారు వీరేనంటూ రఘురామ నిందితులను గుర్తు పట్టిన నేపథ్యంలో ఈ కేసు విచారణ వేగం పుంజుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పక తప్పదు.