చంద్రబాబును చిక్కుల్లో పడేసిన సాయిరెడ్డి

నిజమే… వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిని భలే ఇరకాటంలో పడేశారు. అసలే కూటమి… ఆపై మూడు పార్టీల నేతలూ అవకాశాల కోసం ఆశగా ఎదురు చూస్తున్న వేళ…కేవలం ఒకే ఒక్క సీటు భర్తీ చేయాల్సి రావడం చంద్రబాబుకు ఇబ్బందే కదా. మరి ఈ ఇబ్బందికరమైన పరిస్తితిని చంద్రబాబు ఎలా నెగ్గుకు వస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఎలాంటి పరిస్థితులను అయినా ఇట్టే సరిదిద్దే సత్తా కలిగిన చంద్రబాబుకు ఇదేమీ అంత పెద్ద సమస్య కాదులే అన్న వాదనలూ వినిపిస్తున్నాయి.

రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని చెప్పిన సాయిరెడ్డి…తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. శనివారం ఉదయం ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ కడ్ ను కలిసి తన రాజీనామాను సమర్పించారు. స్పీకర్ ఫార్మాట్ లో సాయిరెడ్డి రాజీనాామా చేయడంతో దానిని ధన్ కడ్ అక్కడికక్కడే ఆమోదించక తప్పలేదు. నిబంధనల మేరకు చర్యలు చేపట్టిన ధన్ కడ్.. సాయిరెడ్డి రాజీనాాామాను ఆమోదించారు. దీంతో సాయిరెడ్డి రాజీనాామాతో ఏపీ కోటాలో ఓ రాజ్యసభ సీటును ఖాళీ అయినట్లు రాజ్యసభ సెక్రటేరియట్ ప్రకటించింది.

రాజ్యసభ సీటు ఖాళీ అయితే దానిని భర్తీ చేయక తప్పదు కదా. త్వరలోనే ఆ సీటును భర్తీ చేసేందుకు ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేయనుంది. ఈ ప్రకటన మేరకు ఎన్నికల్లో వైసీపీ పాల్గొనే అవకాశాలు లేవనే చెప్పాలి. కేవలం 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికల్లో పాలుపంచుకునే అవకాశం వైసీపీకి లేదు.దీంతో ఈ సీటు కూటమికి దక్కడం ఖాయం. ఏపీ కోటాలోని సీటు కాబట్టి… కూటమి పార్టీలకు నేతృత్వం వహిస్తున్న టీడీపీనే అభ్యర్థిని ఖరారు చేయాల్సి ఉంది. వెరసి అభ్యర్థి ఎంపిక బాధ్యత చంద్రబాబుదే.

ఇటీవలే వైసీపీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, ఆర్.కృష్ణయ్య, బీద మస్తాన్ రావులు తమ సభ్యత్వాలకు రాజీనామా చేసిన సమయంలో ఆ మూడు సీట్లను చంద్రబాబే భర్తీ చేశారు. కృష్ణయ్య సీటును బీజేపీకి కేటాయించిన చంద్రబాబు.. బీజేపీ అభ్యర్థన మేరకు కృష్ణయ్యనే ఎంపిక చేశారు. ఇక టీడీపీలో చేరడంతో బీద మస్తాన్ రావు సీటును ఆయనకే ఇచ్చిన చంద్రబాబు… మోపిదేవి సీటును సానా సతీశ్ కు కేటాయించారు. అయితే ఈ సీట్లను దక్కించుకునేందుకు టీడీపీలో చాలా మంది నేతలు యత్నించారు.

ఓ సీటును తమకూ కేటాయించాలని జనసేనాని పవన్ కల్యాణ్ కూడా కోరారు. అయితే మూడు పార్టీల మధ్య అభిప్రాయబేధాలు రాకుండా చర్యలు చేపట్టిన చంద్రబాబు… జనసేనకు టికెట్ ఇవ్వకుండానే నెట్టుకు రాగలిగారు. రాజ్యసభ సీటుకు బదులుగా పవన్ సోదరుడు నాగేంద్రబాబును రాష్ట్ర కేబినెట్ లోకి తీసుకుందామన్న చంద్రబాబు ప్రతిపాదనతో పవన్ మిన్నకుండిపోయారు. మరి ఇప్పుడు సాయిరెడ్డి రాజీనాామాతో అందివచ్చిన సింగిల్ సీటును చంద్రబాబు ఎవరికి కేటాయిస్తారన్న విషయంపై ఆసక్తి నెలకొంది.