గడిచిన రెండు దశాబ్దాల్లో తెలుగు రాజకీయాల ధోరణి పూర్తిగా మారింది. గతంలో ఇందుకు భిన్నమైన రాజకీయ వాతావరణం ఉండేది. ఫలానా నేత.. ఫలానా పార్టీకి మాత్రమే పరిమితం అన్నట్లుగా ఉండే తీరుకు భిన్నంగా అధికారం ఎటువైపు ఉంటే అటువైపు వంగిపోయే తత్త్వం ఎక్కువైంది. సిద్ధాంతాలతో పని లేకుండా కేవలం అధికారం చుట్టూనే తిరిగే నేతల సంఖ్య ఎక్కువైపోతోంది. ఏపీ రాజకీయానికి వస్తే.. చంద్రబాబుతో పోలిస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట ఉండే అత్యంత సన్నిహితులు తమ అధినాయకుడి పట్ల విధేయతను ఎక్కువగా చూపుతుంటారని చెప్పాలి.
వైఎస్ జమానా నుంచే ఈ తీరు కనిపిస్తుంది. అప్పట్లో వైఎస్ కు అత్యంత సన్నిహితంగా ఉండేవారు.. తర్వాతి కాలంలో పార్టీ మారిన వారి సంఖ్య తక్కువ. అయితే.. జగన్ వెంట కంటిన్యూ అయ్యారు. లేదంటే.. రాజకీయాల నుంచి తప్పుకున్నారు. అంతే తప్పించి.. టీడీపీ తీర్థం పుచ్చుకున్నోళ్లు తక్కువే అని చెప్పాలి. తాజాగా వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పార్టీకి మాత్రమే కాదు రాజకీయాలకు గుడ్ బై చెప్పేసిన అంశం రాజకీయ సంచలనంగా మారింది.
జగన్ కు అత్యంత సన్నిహితుల జాబితాను చూస్తే.. వారిలో రాజకీయంగా విజయసాయిరెడ్డి.. సజ్జల రామక్రిష్ణారెడ్డి.. బొత్స సత్యనారాయణ.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ధర్మాన ప్రసాదరావులుగా చెప్పాలి. వ్యాపార భాగస్వామలుగా నిరంజన్ రెడ్డి.. ఎన్ వెంకటరెడ్డి.. అనిల్ కుమార్ యాదవ్ లను చెబుతారు. ఇక.. ఆయనకు రాజకీయంగా అత్యంత విధేయులుగా కొడాలి నాని.. అంబటి రాంబాబు.. పేర్ని నాని పేర్లను చెప్పొచ్చు,.
ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీకి.. పార్టీ అధినేతగా ఉన్న జగన్ కు రాజకీయంగా మంత్రాంగం నడిపే వారిలో కీలకమైన విజయసాయి పార్టీకి దూరం కావటం ఇబ్బందికరంగా చెప్పాలి. పార్టీ ఓటమి పాలైన తర్వాత నుంచి సజ్జల యాక్టివ్ గా కనిపించట్లేదు. మిగిలిన వారిలో అంతో ఇంతో పార్టీ తరఫున బలంగా మాట్లాడుతున్న సీనియర్ నేత ఎవరైనా ఉన్నారంటే ఒక్క బొత్స సత్యనారాయణ మాత్రమే. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికార కేంద్రంగా వ్యవహరించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇటీవల కాలంలో యాక్టివ్ గా లేరు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ కు అండగా నిలుస్తూ.. పార్టీకి ట్రబుల్ షూటర్ గా వ్యవహరించే అవకాశం ఉన్న ఏకైక నాయకుడు బొత్స సత్యనారాయణ మాత్రమేనని చెప్పాలి. విజయసాయి ఎగ్జిట్ తో వైసీపీకి ట్రబుల్ షూటర్ కొరత ఎక్కువ అవుతుందని చెప్పటంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.