అవును.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త పోలీస్ బాస్ రానున్నారు. ఈ అంశంపై ఎవరు వస్తారన్న దానిపై ఇప్పటివరకున్న కన్ఫ్యూజన్ ఒక కొలిక్కి రావటమే కాదు.. ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం ఏపీ డీజీపీగా వ్యవహరిస్తున్న ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో కొత్త పోలీస్ బాస్ ఎవరు అవుతారు? అన్న దానిపై చర్చజరిగినప్పటికీ.. కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాను డిసైడ్ చేస్తారని చెప్పాలి. ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్ గా వ్యవహరిస్తున్న ఆయన.. 1992 బ్యాచ్ కు చెందిన వారు.
ఏపీ తదుపరి డీజీపీగా హరీష్ కుమార్ గుప్తానే ఫైనల్ అన్న మాట బలంగా వినిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికల సమయంలో హరీష్ ను ఏపీ డీజీపీగా కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన సంగతి తెలిసిందే. దీంతో.. ఆ పోస్టులో కొన్నాళ్లు కొనసాగారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ద్వారకా తిరుమలరావును డీజీపీగా నియమించింది.
ఆయన పదవీ విరమణ వేళ.. సీనియార్టీ ప్రకారం 1991 బ్యాచ్ కు చెందిన అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్ మొదటి స్థానంలో ఉన్నప్పటికీ.. రెండో స్థానంలో ఉన్న హరీష్ కుమార్ గుప్తాకే ఏపీ పోలీస్ బాస్ కానున్నట్లుగా చెబుతున్నారు.
దీనికి సంబంధించిన అధికారిక నిర్ణయం త్వరలోనే వెలువడుతుందని చెబుతున్నారు. మరోవైపు.. ప్రస్తుతం పోలీస్ బాస్ గా వ్యవహరిస్తున్న ద్వారకా తిరుమల రావు.. ఆర్టీసీ ఎండీగానూ అదనపు బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. దీంతో.. పదవీ విరమణ తర్వాత కూడా ఆయన ఆ పదవిలో కంటిన్యూ అవుతారన్న మాట బలంగా వినిపిస్తోంది.