ఏపీ నూతన రాజధాని అమరావతికి నూతనోత్తేజం వచ్చేసింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారం చేజిక్కించుకోవడంతోనే అమరావతికి ప్రాణం రాగా… ఆ తర్వాత అమరావతి నిర్మాణానికి అవసరమైన నిధుల లభ్యతకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఊహించిన దాని కంటే మంచి మద్దతు లభించింది. ప్రపంచ బ్యాంకు నుంచి రూ.15 వేల కోట్ల రుణానికి కేంద్రం గ్యారెంటీ ఇవ్వగా… కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని హడ్కో నుంచి రూ.11 వేల కోట్ల నిధులు మంజూరయ్యాయి.
మొత్తంగా రోజుల వ్యవధిలోనే అమరావతికి రూ.26 వేల కోట్ల మేర నిధుల లభ్యత అందిరావడం శుభ పరిణామమేనని చెప్పక తప్పదు. నిధుల లభ్యతపై ప్రకటనలు రాగానే.. ఏపీ సర్కారు అమరావతి నిర్మాణాన్ని పట్టాలెక్కించింది. ఇప్పటికే ఆయా పరిసరాలను శుభ్రం చేయించిన ప్రభుత్వం… అమరావతి నిర్మాణ పనులను ప్రారంభించేసింది. అంతేకాకుండా అమరావతి నిర్మాణ పనులకు తాజాగా టెండర్లను కూడా పిలిచారు.
ఇలాంటి కీలక తరుణంలో హడ్కో నుంచి రూ.11 వేల కోట్ల విడుదలకు రంగం సిద్ధమైపోయింది. ఇటీవలే జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో ఈ నిధుల విడుదలకు ఆమోద ముద్ర పడిందని, త్వరలోనే నిధులను విడుదల చేయనున్నట్లు హడ్కో ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ విషయాన్ని బుధవారం వెల్లడించిన మంత్రి నారాయణ… ఇకపై అమరావతి నిర్మాణం జెట్ స్పీడుతో పరుగులు పెడుతుందని తెలిపారు. ఇప్పటికే వరల్డ్ బ్యాంకు నుంచి కూడా రుణం విడుదలకు మార్గం సుగమం అయ్యిందని, దానికి తోడు హడ్కో నిధులూ అందుబాటులోకి రావడంతో ఇక అమరావతి నిర్మాణంపై వెను దిరిగి చూడాల్సిన అవసరమే రాదని చెప్పాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates