నట సింహం నందమూరి బాలకృష్ణ… సినిమా నటుడే కాదు. ఏపీలో అధికార కూటమి సర్కారును నడుపుతున్న టీడీపీలో కీలక నేత, శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం ఎమ్మెల్యే. అక్కడ ఎమ్మెల్యేగా ఇప్పటికే హ్యాట్రిక్ కొట్టేసిన ఎమ్మెల్యే. వెరసి సినీ నటుడిగానే కాకుండా హిందూపురం ప్రజల గుండెల్లో చోటు దక్కించుకున్న రాజకీయ నేత కూడా. మరి వారికోసం ఏదో ఒకటి చేయాలి కదా. అందుకే… తనకు వీలు చిక్కినప్పుడల్లా ఎంచక్కా.. హిందూపురంలో వాలిపోయే బాలయ్య నియోజకవర్గ పరిదిలో సుడిగాలి పర్యటన చేస్తుంటారు. అవసరమైన పనులకు అక్కడికక్కడే అనుమతులు మంజూరు చేస్తూ… అడిగిన వారికి కాదు, లేదు అనే సమాధానం రాకుండా చూసుకుంటూ ఉంటారు.
తాజాగా మంగళవారం కూడా ఆయన హిందూపురంలో పర్యటించారు. ఈ సందర్బంగా రహదారి భద్రతపై అక్కడి ప్రజలకు అవగాహన కల్పిస్తున్న పోలీసులకు తనవంతు సహకారం అందించారు. అందులో భాగంగా పోలీసులు నిర్వహిస్తున్న రహదారి భద్రతా వారోత్సవాల్లో బాలయ్య ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. తలకు హెల్మెట్ ధరించి…బుల్లెట్ బండి ఎక్కి… అలా రోడ్డుపై రైడ్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. అంతేకాకుండా బైకులపై వెళుతున్న యువత ఎలా వ్యవహరిస్తున్నారన్న దానిని చెప్పిన బాలయ్య… జీవితం అంటే అది కాదని, ఫ్యామిలీకి అండగా నిలవడమే జీవితం అని జీవిత పాఠం చెప్పారు.
బైకులపై హెల్మెట్లు లేకుండా ఝుమ్మంటూ దూసుకుపోతూ కేరింతలు కొట్టడం ఎంజాయిమెంట్ కాదని బాలయ్య చెప్పారు. ప్రయాణాల్లో భద్రతా ప్రమాణాలు పాటించాలని, అప్పుడే సురక్షిత ప్రయాణాలు సాధ్యమవుతాయని తెలిపారు. నిబంధనలు అమలు చేస్తున్న పోలీసులకు సహకరించాలని కూడా బాలయ్య సూచించారు. ఆపై విజయ సంకేతం చూపుతూ బాలయ్య అలా సాగిపోయారు. ఈ సందర్భంగా పట్టణంలోని గురునాథ సర్కిల్ నుంచి ఎన్టీఆర్ కూడలి వరకు బాలయ్య బుల్టెట్ పై సాగిపోగా… ఆయన అభిమానులు కేరింతలు కొడుతూ ఆయన వెంట సాాగారు. ఈ సందర్భంగా బాలయ్య తన తలపై ఎల్లో కలర్ హెల్మెట్ ధరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. బుల్లెట్ రైడింగ్ కు ముందు బాలయ్యే అడిగి మరీ హెల్మెట్ తీసుకోవడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates