డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయడంతో మొదట వలసదారుల్లో టెన్షన్ నెలకొంది. మొట్ట మొదట ట్రంప్ ‘అమెరికా ఫస్ట్’ నినాదాన్ని బలంగా వినిపించారు. అమెరికా ప్రజల కోసం ప్రత్యేకంగా పని చేస్తానని, దేశం ప్రథమ స్థానంలో ఉండేలా నిర్ణయాలు తీసుకుంటానని స్పష్టం చేశారు. ఈ నినాదం గతంలో ట్రంప్ పాలనలో భారతదేశంతో పాటు పలు దేశాలపై ప్రభావం చూపిన విషయం తెలిసిందే.
ట్రంప్ ప్రమాణస్వీకారం అనంతరం తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇప్పటికే ఆసక్తికరంగా మారాయి. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులపై చర్యలు తీసుకోవడంతో పాటు జన్మత పౌరసత్వ చట్టాన్ని రద్దు చేశారు. ఈ కొత్త చట్టం ప్రకారం, అమెరికా గడ్డపై పుట్టిన పిల్లలు పౌరసత్వం పొందాలంటే తల్లిదండ్రుల్లో ఒకరికి అమెరికా పౌరసత్వం ఉండాల్సిందే. ఈ నిర్ణయం అమెరికాలో నివసిస్తున్న భారతీయ వలసదారులకు ప్రత్యేకంగా ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు.
‘అమెరికా ఫస్ట్’ నినాదం కింద ట్రంప్ గతంలో భారతీయ ఉత్పత్తులపై సుంకాలు పెంచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఆయా వస్తువులపై సుంకాలు పెరిగే అవకాశం ఉందని వాణిజ్య నిపుణులు భావిస్తున్నారు. భారతదేశం నుంచి అమెరికాకు ఎగుమతి అవుతున్న స్టీల్, అల్యూమినియం, మెడిసెన్స్ వంటి పలు ఉత్పత్తులపై ఈ ప్రభావం తీవ్రంగా ఉండవచ్చు.
అంతేకాకుండా, హెచ్1బి వీసాల విషయంలో కూడా ట్రంప్ తీసుకునే నిర్ణయాలు భారతీయ ఐటీ ఉద్యోగులకు దెబ్బ తగలవచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది. ట్రంప్ మోదీ మధ్య గతంలో ఉన్న స్నేహపూర్వక సంబంధాలు కొనసాగితే, ఈ ప్రభావాన్ని కొంతమేర సానుకూలంగా మార్చగలమనే అంచనా ఉంది. 2025లో భారత్‌లో జరగనున్న క్వాడ్ సదస్సుకు ట్రంప్ హాజరవుతారని సమాచారం. అమెరికాలోని 54 లక్షల మంది భారతీయులకు ఈ సరికొత్త నిర్ణయాలు ఏమేరకు అనుకూలంగా ఉంటాయో చూడాలి. మోదీ ప్రభుత్వం, ట్రంప్ మధ్య సంబంధాల ఆధారంగా రాబోయే రోజుల్లో ఈ ప్రభావం మార్పులను తీసుకురావచ్చనే ఆశాభావం ఉంది.