అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే, డొనాల్డ్ ట్రంప్ సంచలనాత్మక నిర్ణయాలను అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. తాజాగా, లింగ వైవిధ్యానికి సంబంధించిన చట్టాలను రద్దు చేయాలని ఆయన సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఈ నిర్ణయంపై అధికారిక ఉత్తర్వులకు సంతకం చేస్తానని ట్రంప్ స్వయంగా ప్రకటించారు. ఇకపై అమెరికన్ ఫెడరల్ ప్రభుత్వం స్త్రీ, పురుషులను మాత్రమే గుర్తించనుందని ఆయన వెల్లడించారు. ఈ నిర్ణయం మహిళలను లింగ తీవ్రవాదం నుంచి రక్షించడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
ఇటీవలి కాలంలో అమెరికాలో ట్రాన్స్‌జెండర్ హక్కులు చర్చనీయాంశంగా మారాయి. గత ఎన్నికల ప్రచారంలో రిపబ్లికన్లు లింగ మార్పు చట్టాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. ప్రమాణ స్వీకారానికి ముందు జరిగిన ర్యాలీలో ట్రంప్ మహిళా క్రీడలలో పురుషుల భాగస్వామ్యంపై విమర్శలు చేశారు. ఈ నిర్ణయం ద్వారా పాస్‌పోర్ట్ వంటి ప్రభుత్వ పత్రాల్లో స్త్రీ, పురుషుడు అనే రెండు మాత్రమే లింగ గుర్తింపులు ఉంటాయని ప్రకటించారు. లింగ భావజాలానికి ప్రోత్సాహం కల్పించడానికి ప్రభుత్వం ఇకపై నిధులు ఖర్చు చేయదని ఆయన స్పష్టం చేశారు.
ట్రంప్ అధ్యక్షుడిగా మొదటి సారి ఎన్నికైనప్పుడు, సైన్యంలో ట్రాన్స్‌జెండర్ సిబ్బందిని నియమించడంపై నిషేధం విధించారు. ఆ తర్వాత జో బైడెన్ అధికారంలోకి వచ్చాక ఈ నిర్ణయాన్ని రద్దు చేశారు. అయితే ట్రంప్ మళ్లీ ఈ అంశంపై తనదైన విధంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇది దేశవ్యాప్తంగా పౌర హక్కుల సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొనే అవకాశం ఉంది.
మరోవైపు, కొందరు ట్రంప్ నిర్ణయాన్ని మద్దతు ఇస్తున్నారు. లింగసమానత్వం పేరుతో వస్తున్న సమస్యలకు ఇది పరిష్కారం అవుతుందని విశ్వసిస్తున్నారు. కానీ, యాపిల్, కోస్టో వంటి సంస్థలు మాత్రం ట్రాన్స్‌జెండర్ హక్కులను గౌరవిస్తూ, వారికి అవకాశాలు కల్పిస్తున్నాయి. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా మిశ్రమ స్పందనను తెచ్చుకుంటోంది.