ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం లేదని.. పార్టీకి ఎలాంటి మేలు చేసే కార్యక్రమాలు చేపట్టడం లేదని అధిష్టానం బాహాటంగానే కామెంట్లు చేయడం.. దీనిపై సీనియర్లు మౌనంగా ఉండడం వంటి పరిణామాలు రాజకీయంగా చర్చకు వస్తున్నాయి. వాస్తవానికి గత 2014-19 మధ్య టీడీపీ పాలనతో పోలిస్తే.. ఇప్పుడు కూటమి సర్కారులో సీనియర్ల పాత్రను చంద్రబాబు తగ్గించారు.
ఈ విషయాన్ని చంద్రబాబు స్వయంగా చెప్పుకొచ్చారు. యువ నాయకులకు.. ఏరికోరి మంత్రి పదవులు ఇచ్చారు. అదేవిధంగా వారికి బాధ్యతలు కూడా ఎక్కువగానే అప్పగించారు. ఇది సహజంగానే సీనియర్లకు ఇబ్బందిగా మారింది. పైగా ముగ్గురు నుంచి నలుగురు నేతలకు.. గవర్నర్ పోస్టులు లేదా.. తత్సమానమైన పదవులు ఇప్పిస్తానని ఎన్నికలకు ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ, పార్టీ ప్రభుత్వం ఏర్పడి ఏడు మాసాలు గడిచిపోయినా.. ఇప్పటి వరకు ఆయా పదవులు ఎవరికీ దక్కలేదు.
ఇది సీనియర్లను సహజంగానే అసంతృప్తికి గురి చేసింది. మరోవైపు.. తమకంటే పదేళ్లు.. పదిహేనేళ్లు చిన్న వయస్కులైన నాయకులు.. తమ తమ జిల్లాల్లో అధికారం చలాయించడం కూడా.. సీనియర్లకు కంటగింపుగా మారింది. కానీ, చంద్రబాబు ఆలోచన చూస్తే.. వచ్చే 10 ఏళ్ల తర్వాత.. పార్టీ అవసరాలు.. పార్టీ అధికారం.. వంటివాటినిదృష్టిలో పెట్టుకుని యువ నాయకులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీనిని వ్యతిరేకిస్తున్న తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని సీనియర్లు.. పార్టీ కార్యక్రమాలకు కడు దూరంగా ఉండిపోతున్నారు.
మరీ ముఖ్యంగా తాజాగా జరిగిన ఎన్టీఆర్ వర్ధంతి పరాకాష్టకు చేరింది. ఈ కార్యక్రమాన్ని సీనియర్లు లైట్ తీసుకున్నారు. అదేవిధంగా పార్టీ సభ్యత్వ నమోదు విషయంలోనూ వారు అంటీ ముట్టనట్టే వ్యవహరించారు. ఈ పరిణామాల క్రమంలోనే నారా లోకేష్ కూడా సీనియర్లపై తీవ్రంగా రియాక్టయ్యారు. సీనియర్లను పక్కన పెట్టాల్సిన సమయం వచ్చిందని.. కీలకమైన పొలిట్ బ్యూరోలోనే.. యువతకు 33 శాతం పదవులు దక్కాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.
దీనిని బట్టి టీడీపీ సీనియర్లను వదిలించుకునేందుకు యువతకు ప్రాధాన్యం ఇచ్చేందుకు దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటుందన్న సంకేతాలు ఇచ్చారు. అయితే.. ఈ వ్యవహారంలో యువ నేతలు ఏమేరకు కలిసి వస్తారు? సీనియర్ల ధాటిని ఎదుర్కొని జిల్లాల్లో పార్టీని ఏమేరకు బలోపేతం చేస్తారన్నది భవిష్యత్తు రాజకీయాలే తేల్చాల్సి ఉంటాయి. ఏదేమైనా సీనియర్ల వ్యవహారం కొన్నాళ్ల పాటు పార్టీలో చర్చనీయాంశంగానే మారనుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.