అవును… టీడీపీ పట్ల తెలంగాణకు ఇప్పటికీ ఆశ చావలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణలో టీడీపీకి పెద్దగా నష్టమేమీ జరగలేదనే చెప్పాలి. ఎందుకంటే… రాష్ట్ర విభజన జరిగిన తర్వాత జరిగిన 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి 15 సీట్లు దక్కాయి. ఆ ఎన్నికల్లో తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించిన టీఆర్ఎస్ కు 63 సీట్లు రాగా… తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి 21 సీట్లు వచ్చాయి. ఇక టీడీపీతో కలిసి పోటి చేసిన బీజేపీకి 5 సీట్లు వచ్చాయి. ఈ లెక్కన ఆంధ్రా పార్టీగా పేరు పడిపోయిన టీడీపీకి… ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో పెద్దగా వ్యతిరేకత లేదనే చెప్పాలి.
సరే.. రాష్ట్ర విభజన జరిగిన నాడు ఏపీలో అధికారం చేజిక్కించుకోగా… మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా తెలంగాణలో ఆ పార్టీ క్రమంగా తన ప్రాభవాన్నికోల్పోతున్నట్లుగా కనిపించింది. పార్టీకి కేడర్ ఉన్నా… ఆ కేడర్ ముందు నడిచే నేత లేరని చెప్పాలి. పార్టీ సుప్రీమో నారా చంద్రబాబునాయుడు అత్యధిక సమయం ఏపీ వ్యవహారాలకు కేటాయించాల్సి వస్తుండటం కూడా తెలంగాణలో టీడీపీ తన పట్టును కోల్పోయిందని చెప్పక తప్పదు. రాష్ట్ర విభజన జరిగి అప్పుడే పదేళ్లు దాటిపోతోంది. ఈ పదేళ్లలో రాజకీయంగా ఎన్నో మార్పులు వచ్చాయి. అయినా కూడా ఇప్పటికీ తెలంగాణ ప్రజలకు టీడీపీపై ఆశ చావలేదు.
ఇదేదో అదాటుగా…టీడీపీ అంటే వల్లమాలిన అభిమానం ఉన్న వారు చెబుతున్న మాట కాదు. ఇటీవలే టీడీపీ సభ్యత్వ నమోదును చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో రికార్డులను నమోదు చేసిన టీడీపీ… ఏకంగా కోటి మంది సభ్యులు కలిగిన బలీయమైన పార్టీగా ఆవిర్భవించింది. ఆ కోటి మంది సభ్యుల్లో 1.60 లక్షల మంది తెలంగాణ వారే ఉన్నారట. అంటే… ఎప్పటికైనా టీడీపీ తిరిగి తెలంగాణలో సత్తా చాటుతుందని దాదాపుగా 2 లక్షల మంది బలంగా విశ్వసిస్తున్నారు. వెరసి టీడీపీకి తెలంగాణపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పక తప్పదు.
ఇదే విషయాన్ని పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు వర్ధంతిని పురస్కరించుకుని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. శనివారం ఉదయం హైదరాబాద్ లో ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన సందర్భంగా మాట్లాడిన లోకేశ్.. తెలంగాణలో పార్టీ బలోపేతం దిశగా త్వరలోనే కీలక చర్యలు చేపట్టనున్నామని తెలిపారు. తెలంగాణలో పార్టీ కార్యక్రమాలను త్వరలోనూ ప్రారంభించనున్నామని కూడా ఆయన చెప్పుకొచ్చారు.