ప్రస్తుత రాజకీయాల్లో అధికారంలో ఉన్న పార్టీలదే రాజ్యం. విపక్ష పార్టీలకు కష్ట కాలం. అప్పటిదాకా అధికారంలో ఉండి… ఎన్నికల్లో ఓడిపోయి విపక్షంగా మారిన పార్టీల్లో ఉక్కపోతలు ఓ రేంజిలో పోస్తూ ఉంటాయి. ఈ తరహా ఉక్కపోతలను తట్టుకుని నిలిచే నేతలు చాలా తక్కువ మందే ఉంటారు. అయితే ఈ ఉక్కపోతలను తట్టుకుని నిలిచే నేతలూ చాలా మందే ఉంటారు. అయితే ఇలా తట్టుకుని నిలిచే నేతల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. ఈ పరిణామం ఇటీవలి కాలంలో చాలా స్పష్టంగా కనిపిస్తోంది.
ఏపీలో వైసీపీ మొన్నటిదాకా అధికార పార్టీ. ఇప్పుడా పార్టీ విపక్షంలోకి మారిపోయింది. ఆ వెంటనే ఆ పార్టీ నుంచి వలసలు మొదలైపోయాయి. వైసీపీ అధినేత జగన్ కు అత్యంత సన్నిహితులుగా పేరున్న బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయ భాను, మోపిదేవి వెంకట రమణ లాంటి వారు కూడా వైసీపీని వీడారు. ఆ వెంటనే వారంతా అటు జనసేనలోనో, లేదంటే ఇటు టీడీపీలోనో చేరిపోయారు. ఈ ముగ్గురు నేతలు జగన్ కే కాకుండా వైఎస్ ఫ్యామిలీకి నమ్మిన బంటుల్లాంటి వారి కిందే లెక్క. ఈ తరహా నేతలు పార్టీని వీడారంటే… పార్టీలో పరిస్థితి ఏ మాదిరిగా ఉందన్న దానిపై ఓ రేంజిలో చర్చ జరుగోతంది.
అయితే తాజాగా చోటుచేసుకున్న పరిణామం,, వైసీపీలో ఉక్కపోత ఏ రేంజిలో ఉందన్న విషయాన్ని ఇట్టే చెప్పేసింది. వైసీపీ అధికార ప్రతినిధిగా కొనసాగిన కారుమూరు రవిచంద్రారెడ్డికి పార్టీలో మంచి పేరుంది. పార్టీ వైఖరిపై స్పష్టమైన అవగాహన కలిగిన నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. పార్టీ తరఫున టీవీ డీటేట్లకు హాజరయ్యే ఈ రెడ్డి గారు… తన పార్టీ లైన్ ను క్లిస్టర్ క్లియర్ గా వివరించడంతో పాటుగా… వైరి వర్గాలపై తనదైన శైలి సుతిమెత్తటి వాగ్ధాటితో పైచేయి సాధిస్తూ ఉంటారు. పరుష పదజాలం వాడకానికి ఈయన అల్లంత దూరంలో ఉంటారు. సాధువులా కనిపించే ఈయనను ఓడించడంటే… చాలా కష్టమేనని వైరి వర్గాల వారే చెబుతూ ఉంటారు.
అలాంటి రవిచంద్రారెడ్డి ఇప్పుడు ప్లేటు ఫిరాయించేశారు. వైసీపీకి రాజీనామా చేసిన ఈయన వెనువెంటనే బీజేపీలో చేరిపోయారు. పార్టీలో అధికార ప్రతినిధిగా మంచి గుర్తింపును దక్కించుకున్న ఈ నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన నేత… వైసీపీ అధికారంలో ఉండగా ఓ నామినేటెడ్ పోస్టులోనూ కొనసాగారు. జగన్ కు అత్యంత సన్నిహితుడిగానే పేరున్న రవిచంద్రారెడ్డి.. ఎందుకనో జగన్ కోటరీకి దగ్గర కాలేకపోయారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎప్పుడో ఓ టీవీ డీబేట్ లో సజ్జల రామకృష్ణారెడ్డి వల్లే వైసీపీ ఓడిందంటూ రవిచంద్రారెడ్డి నోరు జారారట. అప్పటి నుంచి ఆయనను పార్టీ దూరం పెట్టినట్లు సమాచారం. దీనిపై ఎంతగా సర్దుకుందామనుకున్నా కుదరలేదట. దీంతోనే వైసీపీకి రాజీనామా చేసిన ఆయన… కేవలం గంట వ్యవధిలోనే బీజేపీలో చేరిపోవడం గమనార్హం.