నిజమే… నిన్నటిదాకా సినిమాల్లో మునిగిపోయి పవర్ స్టార్ గానే జనానికి తెలిసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు పెద్దగా పాలనా అనుభవం లేదన్న వాదనలు ఇప్పుడు పటాపంచలు అయిపోయాయి.. రాజకీయాల్లోకి వచ్చి చాలా కాలమే అయినా పవన్ కల్యాణ్ ఓ ఎమ్మెల్యేగా, ఆపై డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టి కేవలం 7 నెలలు మాత్రమే అవుతోంది. అయితేనేం… ఈ అతి తక్కువ కాలంలోనే పాలనపై పట్టు సాధించేశారు. తనకు కేటాయించిన శాఖలపై నిత్యం సమీక్షలు చేస్తూ సాగుతున్న పవన్… శుక్రవారం దాదాపుగా తన పరిధిలోని అన్నిశాఖలకు సంబంధించి ఓ విషయంలో కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఆయా ప్రభుత్వ శాఖల్లో అవినీతి, అదికారుల చేతివాటం చూస్తున్నదే. ఇందులో ఏ ఒక్క శాఖకూ మినహాయింపు లేదనే చెప్పాలి. ఇదే విషయాన్ని గ్రహించిన పవన్… తన పరిధిలోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అటివీ శాఖల్లో పెండింగ్ లో ఉన్న ఏసీబీ కేసులపై దృష్టి సారించారు. అసలు ఈ శాఖల్లో ఇన్నేసి కేసులు ఎందుకు పెండింగ్ లో ఉన్నాయంటూ ఆయన ఆయా శాఖల కార్యదర్శులను నిలదీశారు. ఇప్పటిదాకా ఆయా శాఖల్లో పెండింగ్ లో ఉన్న ఏసీబీ, విజిలెన్స్ కేసులు ఎన్ని?.. వాటి పెండింగ్ కు కారణాలేమిటన్న దానిప సమగ్ర నివేదిక కావాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా పవన్ ఓ కీలక అంశాన్ని ప్రస్తావించారు. ఏసీబీ, విజిలెన్స్ కేసుల విచారణ సందర్బంగా…నిందితుడు, విచారణాధికారి మధ్య సంబంధం లేకుండా వ్యవహరిస్తే… కేసులు ఎందుకు పరిష్కారం కాకుండా ఉంటాయని ఆయన ప్రశ్నించారు. నిజమే మరి… ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి… విచారణాధికారితో ఏ రూపంగానైనా సంబంధాలు కలిగి ఉంటే… ఆ కేసుల పరిష్కారం అటకెక్కుతుంది కదా. ఈ విషయాన్ని ఇప్పటిదాకా ఏఒక్కరూ అంతగా పట్టించుకున్న దాఖలా కనిపించలేదు. పాలనపై ఎంత అవగాహన లేకుంటే పవన్ ఈ అంశాన్ని ప్రప్తావిస్తారన్న వాదనలు ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. పవన్ ఇదే స్పీడును కొనసాగిస్తే… ఆయా శాఖల్లో అవినీతికి పాల్పడాలంటేనే అధికారులు హడలిపోవడం ఖాయమేనని చెప్పక తప్పదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates