బీటెక్ వర్సెస్ రెడ్డమ్మ… కడపలో కొత్త కొట్లాట

కడపలో ఎం జరిగినా సంచలనమే అవుతోంది. ఈ ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కావడం, జిల్లాపై జగన్ పట్టును తగ్గించేందుకు టీడీపీ అమలు చేస్తున్న వ్యూహాలు, వాటిని తిప్పికొట్టేందుకు వైసీపీ వర్గాలు రచిస్తున్న ప్లాన్లతో.. కడపలో ఏ చిన్న ఘటన జరిగినా సంచలమే అవుతోంది. తాజాగా గురువారం… ఇందుకు భిన్నమైన ఘటన చోటుచేసుకుంది.

కడపలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం కేంద్రంగా జరిగిన ఈ ఘటనలో అధికార పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతల మధ్య తోపులాట చోటుచేసుకుంది. జిల్లాలోని సిద్దవటం మండలం గుండ్లమూల పరిధిలోని ఇసుక క్వారీ కోసం గనుల శాఖ టెండర్లు నిర్వహించింది. ఈ టెండర్లను దక్కించుకునేందుకు కడప ఎమ్మెల్యే గా ఉన్న రెడ్డప్పగారి మాధవి, పులివెందుల నేత, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి పోటీ పడ్డారు. ఈ ఇద్దరు నేతలు అక్కడ కనిపించనున్న.. వారి అనుచరులు మాత్రం హల్చల్ చేసారు. టెండర్లు దాఖలు చేయకుండా ఒకరిని మరొకరు అడ్డుకున్నారు.

ఈ సందర్బంగా అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కలెక్టరేట్ పరిధిలోని గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయం వేదికగా రవి, మాధవి వర్గాల మధ్య గొడవ జరుగుతోందన్న వార్తలు ఒక్కసారిగా రాష్ట్రవ్యాప్తంగా వైరల్ గా మారిపోయాయి.

సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన అక్కడికి చేరుకొని ఇరు వర్గాలకు సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. ఆ తర్వాత ఇరు వర్గాలు ఎవరి టెండర్లు వారు దాఖలు చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.