మంత్రి అయినా.. మూలాలు మ‌ర‌వ‌లేదు!

ఆయ‌న ఏపీ మంత్రి. రాష్ట్ర జ‌ల‌వ‌న‌రుల శాఖ‌కు అమాత్యుడిగా ప‌నిచేస్తున్నారు. రాజ‌కీయంగా వివాద ర‌హి తుడు. ఆర్థికంగా ఎలాంటి వివాదాల‌కు తావులేకుండా ముందుకు సాగుతున్నారు. ఇక‌, మంత్రిగా ఆయ‌న చుట్టూ అంగ ర‌క్ష‌కులు, సిబ్బంది, ప్రొటోకాల్‌కు కొద‌వేలేదు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ద‌గ్గ‌రా ఆయ‌న‌కు చ‌నువు ఉంది. పార్టీలోనూ కీల‌క నాయ‌కుడు. ఆయ‌న ఎక్క‌డ కూర్చున్నా.. ఏం చేస్తున్నా ఎవ‌రూ.. అడ‌గ‌రు. ఎందుకంటే ఆయ‌న ప‌డాల్సిన క‌ష్టం ఎప్పుడో ప‌డ్డారు. గ‌త ఐదేళ్లు కూడా పార్టీ కోసం ప‌నిచేశారు.

ఇదే ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌విని అప్ప‌గించింది. అయితే.. ఆయ‌న తిని కూర్చోవ‌డం లేదు. ప్రొటోకాల్ గౌర‌వాల‌ను కూడా సొంతం చేసుకోవ‌డం లేదు. ఆసాంతం.. త‌న‌ను తాను గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. త‌న మూలాల‌ను త‌డుముకుని చూసుకుంటూనే ఉన్నారు. మ‌ట్టి మ‌నిషిగా మారి.. త‌న సాగును తానే బాగు చేసుకుంటున్నారు. ఆయ‌నే అప్ర‌తిహ‌త విజ‌యాల‌తో ముందుకు సాగుతున్న మంత్రి నిమ్మ‌ల రామానాయుడు. పాల‌కొల్లు నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఆయ‌న‌.. తాజాగా మీడియాలో మ‌రోసారిమెరిసారు.

దీనికి కార‌ణం.. కనుమ పండుగ రోజు పొలం పనుల్లో నిమగ్నం కావ‌డ‌మే. సొంత పొలంలో ఆయ‌న వీపున‌కు పురుగుల‌ మందు బ‌కెట్‌ను క‌ట్టుకుని.. చేతిలో గ‌న్ ప‌ట్టుకుని పొలానికి మందు పిచికారీ చేశారు. కనుమ పండగ నాడు సొంతూరైన ఏలూరు జిల్లా ఆగర్తిపాలెంలో పర్యటించారు. ఈ క్రమంలో నిమ్మల తన పొలానికి వెళ్లి వరి చేనుకు పురుగుల మందు పిచికారీ చేశారు. దీనికి సంబంధించిన పలు వీడియాలు, ఫొటోలు వైర‌ల్‌గా మారాయి.

ఈ సంద‌ర్భంగా మంత్రి నాయుడు మాట్లాడుతూ.. త‌న ప‌నిని తాను చేసుకోవ‌డంలో ఎంతో ఆనందం ఉంద‌న్నారు. రైతుల‌కు మేలు చేసేలా కూట‌మి స‌ర్కారు ప్ర‌య‌త్నిస్తోంద‌ని చెప్పారు. న‌ష్టం లేని సాగును ప్రోత్స‌హించ‌డ‌మే కూట‌మి స‌ర్కారు ఉద్దేశ‌మ‌న్నారు. రైతులు అమ్మిన ధాన్యానికి 48 గంట‌ల్లోనే సొమ్ములు చేతికి అందాయ‌ని.. ఇలా జ‌ర‌గ‌డం ఏపీలో ఐదేళ్ల త‌ర్వాత ఇదే తొలిసారి – అనివ్యాఖ్యానించారు. భ‌విష్య‌త్తులోనూ అన్న‌దాత‌ల‌కు అండ‌గా అనేక కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌నున్న‌ట్టు తెలిపారు.