నాకు ఆ డీఎస్పీ నే కావాలన్న జగన్!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవలి కాలంలో కొంత మేరకు కొత్తగా ప్రవరిస్తున్నారాన్నది నెటిజన్ల కామెంట్. సాధారణంగా ఆయా నేతల భద్రతకు ఎవరిని పంపాలి అన్నది పోలీస్ శాఖ అంతర్గత నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఇందులో ఆయా నేతల ప్రమేయం ఏమీ ఉండదు కూడా. అయితే జగన్ మాత్రం తాను సూచించిన అధికారులనే తన భద్రతకు కేటాయించాలంటూ ఏకంగా హైకోర్టుకే ఎక్కడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

జగన్ ఈరోజు విదేశీ పర్యటనకు వెళుతున్న సంగతి తెలిసిందే. జగన్ ఓ మాజీ సీఎం కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్లినా ప్రభుత్వం ఆయనకు భద్రత కల్పించడం ఆనవాయితీ. ఈ మేరకు జగన్కు సర్కారు భద్రత కల్పించింది కూడా. అయితే తన భద్రతకు తాను సూచించిన పోలీసులే ఉండాలని జగన్ భావిస్తున్నారు.

తన భద్రతలో డీఎస్పీగా పనిచేస్తున్న మహబూబ్ భాషను నియమించాలని ఆయన ఇటీవలే ప్రభుత్వానికి ఓ లేఖ రాసారు. దీనిపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దీంతో జగన్ నేరుగా సోమవారం హైకోర్టును ఆశ్రయించారు.

జగన్ కోరుతున్న మహబూబ్ బాషా ప్రస్తుతం అనంతపురం పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో అదనపు కమాండెంటుగా పని చేస్తున్నారు. బాషా కు తన భద్రత పట్ల సంపూర్ణ అవగాహనా ఉందని.. ఈ కారణంగా ఆయననే తన భద్రతకు కేటాయించాలని జగన్ కోర్టును కోరారు. దీనిపై అత్యవసరంగానే విచారణ చేపట్టిన కోర్టు తన తీర్పును అయితే వెల్లడించలేదు.

దీంతో బాషా లేకుండానే జగన్ విదేశీ పర్యటనకు వెళుతున్నారు. ఈ పరిణామంతో ఒకింత దిగాలుగానే జగన్ బయలుదేరుతున్నారని చెప్పాలి. లండన్ లో చదువుతున్న తన కుమార్తె వద్దకు జగన్ తన కుటుంబంతో కలిసి వెళుతున్న సంగతి తెలిసిందే. ఈ నెలాఖరు వరకు ఆయన లండన్ లోనే ఉంటారు.