రేప‌టి నుంచి మ‌హా కుంభ‌మేళా… భారీ ఏర్పాట్లు

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ప‌విత్ర ప్ర‌యాగ్‌రాజ్ జిల్లాలో సోమ‌వారం(జ‌న‌వ‌రి 13) నుంచి 45 రోజుల పాటు జ‌ర‌గ‌ను న్న మ‌హా కుంభ‌మేళాకు స‌ర్వం సిద్ధ‌మ‌య్యాయి. ఈ క్ర‌తువు.. 114 ఏళ్ల‌కు ఒక‌సారి వ‌స్తుంద‌ని పండితులు చెబుతున్నారు.

అంత‌ర్వాహినిగా ఉన్న స‌రస్వ‌తి న‌ది- గంగ, య‌మున‌ల‌తో జ‌త‌క‌లిసే చోటు ప్ర‌యాగ్ రాజ్‌లో ఉంది. అక్క‌డే ఈ మ‌హా కుంభ‌మేళాను నిర్వ‌హిస్తున్నారు. దీనికి దేశ‌వ్యాప్తంగానే కాకుండా.. ప్ర‌పంచ వ్యాప్తంగా కూడా.. ప్ర‌జ‌లు హాజ‌ర‌వుతున్నారు.

ఈ క్ర‌తువును యోగి ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా తీసుకుంది. 7500 కోట్ల‌రూపాయ‌ల‌ను ధారాపాతంగా ఖ‌ర్చు చేశారు. అనేక మంది నుంచి విరాళాలు కూడా సేక‌రించారు. నిత్యాన్న దానంతోపాటు.. భ‌క్తుల‌కు వ‌స‌తి సౌక‌ర్యాల‌ను కూడా ప్ర‌భుత్వం క‌ల్పిస్తోంది. ఇక‌, ఆరోగ్య సంర‌క్ష‌ణ చ‌ర్య‌ల‌కు కూడా ప్రాధాన్యం ఇస్తోంది.

ప్ర‌స్తుతం హెచ్ ఎంపీవీ వైర‌స్ క‌ల‌క‌లం రేపుతున్న నేప‌థ్యంలో మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. సో.. మొత్తంగా మ‌హాకుంభ‌మేళాకు 40 కోట్ల మంది హాజ‌ర‌వుతున్నార‌న్న అంచ‌నాతో అన్ని ఏర్పాట్ల‌ను సీఎం యోగి జాగ్ర‌త్త‌గా ప‌రిశీలిస్తున్నారు.

ఇక‌, తాజాగా రెండు రోజుల కింద‌ట తిరుప‌తిలో చోటు చేసుకున్న తొక్కిస‌లాట ఘ‌ట‌న నేప‌థ్యంలో యూపీ ప్ర‌భుత్వం అలెర్ట‌యింది. తిరుప‌తిలో ఏం జ‌రిగింద‌న్న విష‌యాల‌ను అధికారికంగా సేకరించిన స‌ర్కారు ఆ మేర‌కు ఏర్పాట్లను మ‌రింత ముమ్మ‌రం చేసింది.

అంతేకాదు.. తిరుప‌తిలో తొక్కిస‌లాట ఘ‌ట‌న‌కు కార‌ణాలు తెలుసుకుని.. అధికారుల సంఖ్యను పెంచారు. ప్ర‌వేశ, నిర్గ‌మ మార్గాల్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా.. ప్ర‌వేశ మార్గాల‌ను మ‌రింత వెడ‌ల్పు చేస్తున్నారు.

మొత్తంగా చూస్తే.. మ‌హాకుంభ‌మేళాను ఎలాంటి ఇబ్బందులు రాకుండా చేసేందుకు యోగి స‌ర్కారు ప్ర‌యత్నిస్తోంది. ఈ కుంభ‌మేళాకు ప్ర‌ధాని, రాష్ట్ర‌ప‌తి, ఉప‌రాష్ట్రప‌తి స‌హా అనేక మంది హాజ‌రుకానున్నారు. దీంతో వీఐపీలకు ఇబ్బందులు రాకుండా.. ఇదే స‌మ‌యంలో వీరి ప్ర‌భావం సాధార‌ణ భ‌క్తుల‌పై ప‌డ‌కుండా కూడా ప్ర‌భుత్వం జాగ్ర‌త్త‌లు తీసుకుంటోంది.

భ‌క్తులు త‌మ వెంట కొన్ని మాస్కులు ఉంచుకుంటే స‌రిపోతుంద‌ని ప్ర‌భుత్వం తెలిపింది. ఇక‌, వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌త‌కు కూడా ప్రాధాన్యం ఇస్తోంది. ఏదేమైనా యూపీ స‌ర్కారు ఈ క్ర‌తువును ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకోవ‌డం గ‌మ‌నార్హం.