తిరుమలలో వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి చెందగా 40 మంది గాయపడ్డారు. ఈ క్రమంలోనే ఆ ఘటనకు బాధ్యత వహిస్తూ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణలు చెప్పాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఆ ఘటనలో తమ తప్పు లేకున్నా టీటీడీ తరఫున భక్తులందరికీ బేషరతుగా క్షమాపణలు చెబుతున్నానని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు.
అంతకుముందు, మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా బీఆర్ నాయుడు చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. క్షమాపణలు చెప్పడంలో తప్పులేదని, క్షమాపణలు చెప్పినంత మాత్రాన చనిపోయిన వారు తిరిగి రారని, ఎవరో ఏదో మాట్లాడారని అన్నింటికి స్పందించాల్సిన అవసరం లేదని బీఆర్ నాయుడు చేసిన కామెంట్లు పవన్ ను ఉద్దేశించి చేసినవేనని సోషల్ మీడియాలో టాక్ వచ్చింది. ఈ క్రమంలోనే ఆ టాక్ పై బీఆర్ నాయుడు స్పందించారు.
ఆ వ్యాఖ్యలు పవన్ ను ఉద్దేశించి చేసినవి కావని, తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని బీఆర్ నాయుడు క్లారిటీనిచ్చారు. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరి కామెంట్లపై స్పందించాల్సిన అవసరం లేదన్న ఉద్దేశ్యంతో తాను ఆ వ్యాఖ్యలు చేశానని ఆయన స్పష్టతనిచ్చారు. తన వ్యాఖ్యలను పవన్ కు ఆపాదించడం సరికాదని అన్నారు.
తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని, ఆ ఘటనకు బాధ్యులైన వారిని ఉపేక్షించేది లేదని చెప్పారు. చిన్న చిన్న పొరపాట్లు జరిగాయని తమ దృష్టికి వచ్చిందని, న్యాయ విచారణలో తప్పు ఎవరిదన్న విషయం వెల్లడవుతుందని తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.