తిరుమల తొక్కిసలాటకు రీజన్ ఇదేనట

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేందుకు వచ్చిన భక్తులు టోకెన్ల కోసం ఎగబడటం, ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు చనిపోవడం, 40 మంది దాకా భక్తులు గాయపడిన సంగతి తెలిసిందే. తిరుపతి నగరంలోని బైరాగిపట్టెడ ప్రాంతంలో ఏర్పాటు చేసిన టోకెన్ల జారీ కేంద్రం వద్ద జరిగిన ఈ ఘటనకు దారి తీసిన కారణాలేమిటన్న దానిపై ఇప్పటిదాకా స్పష్టత లేదు. అయితే దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈ కారణాన్ని తాజాగా శుక్రవారం వెల్లడించారు. అంతేకాకుండా ఈ ఘటనకు సంబంధింది ప్రచారంలో ఉన్న పలు అంశాలపైనా ఆయన స్పష్టత ఇచ్చారు.

బైరాగిపట్టెడ కేంద్రం వద్ద అప్పటికే అన్ని కౌంటర్ల వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో చేరిపోయారు. బుధవారం తెల్లవారుజాము నుంచే భక్తుల రాక ప్రారంభం కాగా… భక్తుల రద్దీ అంతకంతకూ పెరిగిపోయింది.అంతేకాకుండా ఉదయాన అనగా వచ్చిన భక్తులు టోకెన్ల కోసం రాత్రి దాకా అక్కడే పడిగాపులు కాశారు. ఈ క్రమంలో ఓ భక్తురాలు అస్వస్థతకు గురి కాగా… ఆమెను అక్కడి నుంచి బయటకు తీసుకురావాలని సిబ్బంది యత్నించారు. ఈ క్రమంలో సదరు భక్తురాలు ఉన్న గేటు కాకుండా… పొరపాటున పక్కనున్న గేటును సిబ్బంది తెరిచారట. దీంతో టోకెన్ల పంపిణీ మొదలు అయిందేమోనన్న భావనతో భక్తులంతా తెరిచిన గేటు నుంచి లోపలికి వెళ్లే యత్నం చేశారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట చోటుచేసుకుందని, అందులో ఆరుగురు భక్తులు చనిపోయారని మంత్రి ఆనం తెలిపారు.

ఇక ఈ ఘటనకు పూర్తిగా డీఎస్పీ రమణ కుమారే బాధ్యులని బుధవారం నుంచి కూడా ప్రచారం సాగుతూనే ఉంది. అంతేకాకుండా ప్రభుత్వం జరిపిన ప్రాథమిక విచారణలో కూడా రమణ కుమార్ నిర్లక్ష్యం కారణంగానే తొక్కిసలాట జరిగిందని కూడా తేలింది. దీంతో ఆయనపై రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. అయితే తాజాగా శుక్రవారం మంత్రి ఆనం… ఘటన జరిగిన సమయంలో అక్కడ అసలు డీఎస్పీ స్థాయి అధికారే లేరని కూడా చెప్పారు. వెరసి ఈ ప్రకటనతో తిరుమల తొక్కిసలాటపై మంత్రి సరికొత్త చర్చకు తెర లేపినట్టైైంది.