ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే విజన్‌కు పరాకాష్ఠ. ఆయన దూరదృష్టి.. భవిష్యత్తును ముందుగానే ఊహించడం.. దానికి తగిన ప్రణాళికలు వేసుకుని ముందుకు సాగడం తెలిసిందే. ఆయన వేసిన బాటలు.. ఇప్పుడు మనకు కనిపించకపోవచ్చు.. కానీ, ఓ పదేళ్ల తర్వాత వాటి తాలూకు ఫలాలు, ఫలితాలు.. ప్రజలకు చేరువ అవుతాయనడంలో సందేహం లేదు. ఈ విషయంలో సైబరాబాద్, హైదరాబాద్‌లే ప్రధాన ఉదాహరణ. అప్పట్లో ఆయన వేసిన అడుగులు ఇప్పటికీ.. ప్రజలకు మేలు చేస్తున్నాయి.
ఇలా.. చంద్రబాబు ఏపీ విషయంలోనూ అలాంటి దూరదృష్టితోనే ముందుకు సాగుతున్నారు. ఇక, ఈ విజన్ ఇప్పుడు విపత్తుల విషయంలోనూ చంద్రబాబు ప్రదర్శిస్తున్నారు. ఎక్కడా తగ్గడం లేదన్న వాదన వినిపిస్తోంది. విపత్తులు సంభవించడం ఎక్కడైనా కామన్ గానే జరుగుతుంది. అవి ప్రకృతి సిద్ధంగా అయినా కావొచ్చు.. పొరపాట్ల వల్లయినా కావొచ్చు. ఎలా జరిగినా.. ప్రజల ప్రాణాలకు మాత్రం ముప్పు ఉంటుందన్నది వాస్తవం.
ఈ విషయాల్లో చంద్రబాబు ఘటన జరగకముందే చర్యలు తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ ఏదైనా జరగరాని ఘటన జరిగితే మాత్రం అందరికన్నా ముందుగానే తాను అక్కడ ప్రత్యక్ష మవుతున్నారు. విజయవాడలో బుడమేరు పొంగినప్పుడు కానీ.. ఏలూరులో ఎర్రకాలువ కట్టలు తెంచుకున్నప్పుడు కానీ.. చంద్రబాబు ఆఘమేఘాలపై స్పందించారు. తన వయసును కూడా ఆయన లెక్కచేయకుండానే ప్రజల మధ్యకు వచ్చారు. వరదలోనే కలియదిరిగి ప్రజలకు భరోసా కల్పించారు.
ఇది ప్రజల ఆవేదనను చాలా వరకు తగ్గించింది. నష్టం పూర్తి నివారించలేక పోయినా.. వారికి కొంత సాంత్వన అయితే కల్పించారు. ఇక, తాజాగా తిరుపతి తొక్కిసలాట ఘటన విషయంలోనూ చంద్రబాబు హుటాహుటిన స్పందించారు. తానే స్వయంగా రంగంలోకి దిగారు. ఊరట కల్పించారు. బాధితులను పరామర్శించారు. ఇది.. బాధిత కుటుంబాలకు చాలా వరకు మేలు చేసిందనే చెప్పాలి. ఇలా.. విపత్తుల సమయంలోనూ తన వయసుతో నిమిత్తం లేకుండా.. చంద్రబాబు వేస్తున్న అడుగులు కూటమి సర్కారుకు శ్రీరామరక్షగా మారాయని అంటున్నారు పార్టీ నాయకులు.