ఫార్ములా ఈ కారు రేసుల వ్యవహారంలో ఏసీబీ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గురువారం హాజరయ్యారు. బీఆర్ఎస్ శ్రేణులు భయపడినట్టుగా ఈ కేసులో కేసీఆర్ ను విచారించిన ఏసీబీ అధికారులు… ఆయనను అరెస్ట్ అయితే చేయలేదు. దాదాపుగా 7 గంటల పాటు ఏసీబీ విచారణ కొనసాగగా…మధ్యాహ్నం ఓ అరగంట పాటు కేటీఆర్ కు లంచ్ బ్రేక్ దొరికింది. సాయంత్రం దాకా విచారణ కొనసాగగా… తమ విచారణ ప్రస్తుతానికి ముగిసిందని ఏసీబీ అధికారులు ప్రకటించగా… కేటీఆర్ ఏసీబీ కార్యాలయం నుంచి బయటకు వచ్చి నేరుగా ఇంటికి వెళ్లిపోయారు.
ఏసీబీ విచారణకు తన న్యాయవాదిని వెంటబెట్టుకుని వెళ్లిన కేటీఆర్… విచారణకు పూర్తిగానే సహకరించినట్లు సమాచారం. విచారణ గదిలోకి తన లాయర్ ను అనుమతించాల్సిందేనని కేటీఆర్ పట్టుబట్టినా… అందుకు తెలంగాణ హైకోర్టు కూడా ఒప్పుకోకపోవడంతో ఆయన ఒంటరిగానే విచారణకు హాజరయ్యారు. అయితే ఆయన వెంట వెళ్లిన లాయర్ రామచంద్రారావు విచారణ జరుగుతున్న తీరును విచారణ గది బయటే కూర్చుని పరిశీలించారు. మొత్తంగా ఏసీబీ విచారణ బీఆర్ఎస్ శ్రేణులు భయపడ్డ రీతిలో అయితే జరగలేదు. కేటీఆర్ ను ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండానే… విచారణ బృందం ఆయనను ప్రశ్నించినల్టు సమాచారం.
ఇక విచారణ అనంతరం ఏసీబీ కార్యాలయం బయట మీడియాతో మాట్లాడిన కేటీఆర్… విచారణ జరిగిన తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫార్ములా రేసుల్లో నిధుల చెల్లింపు జరిగిందని, దానికి సంబంధించిన ఆధారాలు అన్నీ బహిరంగంగానే ఉన్నాయని చెప్పారు. అంతా ఓపెన్ గానే జరిగితే…ఇక అవినీతి ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా ఏసీబీ అధికారులు విచారణలో బాగంగా సీఎం రేవంత్ రెడ్డి రాసినచ్చిన ప్రశ్నలనే అడిగారంటూ తీవ్ర ఆరోపణ చేశారు. కేవలం నాలుగు ప్రశ్నలను పట్టుకుని వచ్చిన ఏసీబీ అధికారులు… వాటినే తిప్పి తిప్పి అడిగి… 40 ప్రశ్నలు అడిగినట్లుగా కలరింగ్ ఇచ్చారన్నారు.
విచారణకు తాను పూర్తిగా సహకరించానని చెప్పిన కేటీఆర్… సంక్రాంతి తర్వాత మరోమారు విచారణకు రావాల్సి ఉంటుందని చెప్పారన్నారు. ఈ వ్యవహారంలో ఏసీబీ అధికారులు ఎన్ని సార్లు విచారణకు పిలిచినా తాను హాజరవుతానని కూడా ఆయన చెప్పారు. విచారణలో తనకు తెలిసిన విషయాలను తన అవగాహన మేరకు సమాధానంగా చెప్పానని తెలిపారు. విచారణలో ఏ ఒక్కప్రశ్నకు కూడా తాను దాటవేత ధోరణిని అవలంభించలేదని కూడా కేటీఆర్ చెప్పారు. విచారణకు పిలిచిన ఏసీబీ అధికారులు కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారని భయపడ్డ బీఆర్ఎస్ శ్రేణులు… విచారణను ముగించుకుని ఆయన ఇంటికి చేరడంతో ఊపిరి పీల్చుకున్నాయి.