ఏపీ ఎవరి జాగీరు కాదండి: ముద్రగడ

వైసీపీ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభ రెడ్డి గురువారం సీఎం నారా చంద్రబాబునాయుడుకు ఓ లేఖ రాశారు. ఈ లేఖలో చంద్రబాబుతో తన స్నేహాన్ని, టీడీపీలో తాను కొనసాగిన విషయాన్ని. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డితో చంద్రబాబు స్నేహాన్ని ప్రస్తావిస్తూ సాగిన ముద్రగడ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలపై కూటమి సర్కారు కక్షపూరిత వైఖరితో సాగుతోందని ఆరోపించిన ముద్రగడ… ఆ వైఖరిని మార్చుకోవాలని సూచించారు. అంతటితో ఆగని ముద్రగడ… ఒకవేళ జగన్ తిరిగి అధికారంలోకి వస్తే… ఆయన కూడా కూటమి సర్కారు మాదిరే ప్రతీకార దాడులకు పాల్పడితే మీ పరిస్థితి ఏమిటని కూడా చంద్రబాబును ప్రశ్నించారు.

ఈ లేఖలో ముద్రగడ తనదైన శైలి పడికట్టు పదాలను వాడుతూ సాగిపోయారు. గతంలో తనను చంద్రబాబే టీడీపీలోకి ఆహ్వానించారని, అలా టీడీపీలో చేరిన తాను ఐదేళ్ల పాటు టీడీపీలోనే కొనసాగానని తెలిపారు. అయితే నాడు చంద్రబాబు అధికారంలో ఉన్నా… ప్రస్తుతం కనిపిస్తున్న పగలు, ప్రతీకారాలు లేవని తెలిపారు. ఇక 1978లో చంద్రబాబు, వైఎస్సార్ తో కలసి తాను కూడా తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన విషయాన్ని గుర్తు చేశారు. నాడు నేతల మధ్య ఉన్న స్నేహ సంబంధాలను ఆయన ప్రస్తావించారు. నాడు ప్రత్యర్థులను వేధించడం గానీ, అక్రమ కేసులు పెట్టడం గానీ తాను చూడలేదన్నారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితులు కనిపించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఏపీ ఎవరి జాగీరు కాదని, ఏ ఒక్కరి ఎస్టేట్ కూడా కాదని కూడా ముద్రగడ పేర్కొన్నారు. మంత్రి నారా లోకేశ్ పేరును నేరుగా ప్రస్తావించని ముద్రగడ…రెడ్ బుక్ పేరిట ప్రత్యర్థులపై నిత్యం కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. ఇది మంచి సంప్రదాయం కాదని తెలిపారు. అమావాస్యం తర్వాత పౌర్ణమి… పౌర్ణమి తర్వాత తిరిగి అమావాస్య వస్తాయని చెప్పిన ముద్రగడ..జగన్ కూడా తిరిగి అధికారంలోకి రాకపోరని తెలిపారు. అదే జరిగితే… జగన్ కూడా రెడ్ బుక్ తరహా పాలనకు శ్రీకారం చుడితే మీ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. జగన్ సంయమనం పాటించినా… దెబ్బతిన్న వారుగా వైసీపీ శ్రేణులు జగన్ పై ఒత్తిడి తీసుకుని వస్తారని ఆయన తెలిపారు. గతంలో నేతల మధ్య కొనసాగిన స్నేహ సంబంధాలను గుర్తు చేసుకుని అయినా లోకేశ్ ను నిలువరించాలని ఆయన చంద్రబాబును కోరారు.