తిరుమల తోపులాట ఘటనలో ఆరుగురు భక్తులు చనిపోయిన ఘటనపై ఏపీలోని కూటమి ప్రభుత్వం వేగంగా స్పందించింది. బుధవారం విశాఖ పర్యటనకు వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రావడంతో సీఎం నారా చంద్రబాబునాయుడుతో పాటుగా మంత్రులు, ఇతరత్రా కీలక అధికారులంతా అక్కడికి వెళ్లిన సంగతి తెలిసిందే. మోదీ పర్యటన నిర్దేశిత సమయంలోనే ప్రశాంతంగా ముగిసింది. మోదీ పర్యటనలో ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంటూ ఉండగానే… తిరుపతిలో జరిగిన తోపులాటతో యంత్రాంగం ఒక్కసారిగా షాక్ కు గురైంది. వెనువెంటనే తేరుకున్న చంద్రబాబు… ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకున్నారు. సహాయక చర్యల కోసం ఆదేశాలు జారీ చేశారు.
తాజాగా గురువారం ఉదయం తోపులాట ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు పరిహారం ప్రకటిస్తూ కూటమి సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్కో మృతుడికి రూ.25 లక్షల మేర పరిహారం అందించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గురువారం ఉదయం ఓ ప్రకటన చేశారు. ఈ ఘటనలో ఇప్పటిదాకా ఆరుగురు చనిపోగా… దాదాపుగా 40 మందికి పైగా భక్తులు తిరుపతిలోని పలు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. సీఎం ఆదేశాలతో సహచర మంత్రులు వంగలపూడి అనిత, ఆనం రామనారాయణ రెడ్డిలతో కలిసి తిరుపతి చేరుకున్న అనగాని… రుయా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న బాధితులను పరామర్శించారు. అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడిన సందర్భంగా చనిపోయిన వారకి పరిహారంపై ఆయన ప్రకటన చేశారు.
ఇదిలా ఉంటే… ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు గురువారం తిరుపతి పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా తోపులాట జరిగిన ప్రదేశాన్ని పరిశీలించడంతో పాటుగా ఈ ఘటనలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులను ఆయన పరార్శించనున్నారు. అదే విధంగా తోపులాటలో గాయపడి చికిత్స తీసుకుంటున్న వారిని ఆయన పరామర్శించనున్నారు. సీఎం రావడానికి ముందే… మంత్రులు తిరుపతికి వచ్చి పరిస్థితిని చక్కదిద్దేయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే… వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోటాలో గురువారం నాటి కోటా పూర్తి అయ్యింది. దీంతో టోకెన్ల జారీ పూర్తి అయినట్లు ప్రకటించిన టీటీడీ… తిరిగి ఈ నెల 13న మిగిలిన టోకెన్లను జారీ చేయనున్నట్లు ప్రకటించింది. అయితే తోపులాట నేపథ్యంలో ఈ టోకెన్ల జారపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోనుందన్న దానిపైై ఆసక్తి నెలకొంది.
ఇక ఈ ఘటనపై టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు బుధవారం రాత్రే స్పందించారు. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కోసం వచ్చే భక్తులకు సరిపడ ఏర్పాట్లు చేశామని చెప్పిన ఆయన… కొందరు అధికారుల నిర్లక్ష్య కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకుందన్నారు. నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. మరోవైపు టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి గురువారం ఉదయం ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్న బాదితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన వెంకన్న భక్త కోటికి బోర్డు తరఫున క్షమాపణలు చెప్పారు. గతంలో ఎన్నడూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకోలేదని ఆయన తెలిపారు. ఇకపై ఈ తరహా ప్రమాదాలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందన్న ఆయన… ఘటనకు బాధ్యులుగా తేలే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.