బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గురువారం ఉదయం ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఫార్ములా ఈ కారు రేసులకు సంబంధించి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారంటూ ఏసీబీ నమోదు చేసిన కేసులో కేటీఆర్ ఏ 1గా ఉన్నారు. ఇక ఈ కేసులో ఏ 2గా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ 3గా హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి ఉన్నారు. ఈ కేసులో విచారణకు రావాలంటూ గతంలోనే ఏసీబీ జారీ చేసిన నోటీసులకు సానుకూలంగా స్పదించిన కేటీఆర్,… లాయర్ ను వెంటబెట్టుకుని విచారణకు వెళ్లారు. అయితే విచారణలో లాయర్ ను అనుమతించమని ఏసీబీ చెప్పడంతో కేటీఆర్ విచారణకు హాజరు కాకుండానే వెనుదిరిగారు.
విచారణలో లాయర్ ను అనుమతించమన్న ఏసీబీ తీరును ప్రశ్నిస్తూ కేటీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.బుధవారం ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు… విచారణ గదిలోకి లాయర్ కు అనుమతి లేదని, లాయర్ గది బయట ఉండి విచారణను పర్యవేక్షిస్తారంటే తమకు అభ్యంతరం లేదని తేల్చిచెప్పింది. అంతేకాకుండా విచారణలో ఏసీబీ అధికారులు ఇబ్బంది పెడితే… తిరిగి కోర్టును ఆశ్రయించవచ్చని కేటీఆర్ కు సూచించింది. దీంతో గురువారం నాటి విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. రామచంద్రారావు అనే లాయర్ ను వెంట బెట్టుకుని కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. ఇక తమ వద్దకు వచ్చిన కేటీఆర్ ను విచారించేందుకు ఏసీబీ ముగ్గురు అధికారులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇక ఈ విచారణను ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి పర్యవేక్షించనున్నారు.
ఇదిలా ఉంటే… గత కొన్ని రోజులుగా వరుసగా చోటుచేసుకుంటున్న పరిణాామాలను బట్టి చూస్తుంటే… విచారణ అనంతరం కేటీఆర్ ను ఏసీబీ అరెస్ట్ చేయడం ఖాయమన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ భావనతోనే ఉన్న బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయాయి. ఈ కారణంగానే గురువారం ఉదయానికే కేటీఆర్ నివాసానికి భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు చేరుకున్నాయి. అంతేకాకుండా కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి బయలుదేరగా… ఆయన కారును పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో వెంబడించాయి. మొత్తంగా కేటీఆర్ అరెస్ట్ అవుతారన్న వార్తలతో హైదరాబాద్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. విచారణ అనంతరం కేటీఆర్ ఇంటికి తిరిగి వస్తే సరే…అలా కాకుండా కేటీఆర్ ఆరెస్ట్ అయితే మాత్రం బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా సమాచారం.