విశాఖ బహిరంగ సభలో ప్రధాని మోదీని ఉద్దేశించి ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచం మెచ్చే ఏకైక నాయకుడు ప్రధాని మోదీ అని కొనియాడారు. సరైన సమయంలో సరైన ప్రధాని ఉన్నారని, సమస్యలను సత్వరం అర్థం చేసుకోగల సత్తా మోదీకి ఉందని చంద్రబాబు కొనియాడారు. పనులు చకచకా జరిగేలా మోదీ చొరవ చూపిస్తారని, మరే ప్రధానికి ఇది సాధ్యం కాలేదని ప్రశంసించారు.
రాష్ట్రాభివృద్ధి గురించే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎల్లపుడూ ఆలోచిస్తుంటారని, నేను ముందుంటాను అని చొరవ తీసుకుంటారని ప్రశంసించారు. 2024 ఎన్నికల్లో 93 శాతం స్ట్రైక్‌రేట్‌తో గెలిపించారని, ఈ సారి ఏర్పడిన ఎన్డీఏ కూటమి కాంబినేషన్ భవిష్యత్తులోనూ కొనసాగుతుందని చెప్పారు. మోదీ ప్రధానిగా దేశ రాజకీయాల్లో ఉంటారని అన్నారు. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వం లక్ష్యమన్నారు. విధ్వంసాలు చేసే పార్టీలను దూరంగా ఉంచాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
మోదీ సారథ్యంలో భారత్ ప్రగతిని ప్రపంచమంతా గమనిస్తోందన్నారు. ఢిల్లీ ఎన్నికల్లోనూ ఎన్డీఏ గెలుస్తుంది…రాసిపెట్టుకోండి అంటూ చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా సంక్షేమం, అభివృద్ధి, సంస్కరణలు, సుపరిపాలనను మోదీ అందిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో రూ.2.08 లక్షల కోట్ల విలువైన పనులకు మోదీ శ్రీకారం చుట్టబోతున్నారని తెలిపారు. విశాఖ రైల్వే జోన్, నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కు వస్తాయన్నారు.
ప్రధాని మోదీ చేపట్టిన కార్యక్రమాలు, తీసుకువచ్చిన సంస్కరణల వల్ల 2047 నాటికి ప్రపంచంలో భారత్ మొదటి లేదా రెండో స్థానంలో ఉంటుందని అన్నారు. కేంద్రం సాయంతో విభజిత ఆంధ్రప్రదేశ్ నిలదొక్కుకుందని, ప్రధాని మోదీ సహకారంతో ముందుకెళ్తున్నామని తెలిపారు. కేంద్రం అండతో ఏపీకి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. సూపర్ సిక్స్ హామీలన్నీ అమలుచేసే బాధ్యత తమదని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రానికి ఆర్థిక రాజధానిగా విశాఖ డెవలప్ అవుతుందని చెప్పారు. త్వరలో అమరావతికి రావాలని మోదీని ఆహ్వానించామని, నదుల అనుసంధానానికి కేంద్రం సాయం కావాలని చెప్పారు.