లాయర్లు దూరాన కూర్చుంటే ఓకే… కేటీఆర్ కు హైకోర్టు షాక్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు హైకోర్టులో గట్టి షాకే తగిలింది. ఏసీబీ విచారణకు హాజరయ్యే సమయంలో తన వెంట తన న్యాయవాదులను తీసుకెళతానని, అందుకు అనుతించాలంటూ కేటీఆర్ దాఖలు చేసుకున్న పిటిషన్ ను విచారించిన హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఏసీబీ విచారణకు లాయర్ల అవసరం ఏముందని ఈ సందర్భంగా కోర్టు కేటీఆర్ ను ప్రశ్నంచింది. ఏసీబీ విచారణలో కేటీఆర్ తో పాటు ఆయన లాయర్లు కూర్చోవడానికి వీల్లేదని కూడా కోర్టు తేల్చి చెప్పింది. వెరసి లాయర్ ను అనుమతిస్తేనే ఏసీబీ విచారణకు హాజరవుతానంటున్న కేటీఆర్ కు కోర్టు షాకిచ్చందనే చెప్పాలి.

ఫార్ములా ఈ కారు రేసుల వ్యవహారంలో ప్రజా ధనం దుర్వినియోగం అయ్యిందని, ఈ వ్యవహారంలో అంతిమంగా ఎవరికి లబ్ధి జరిగిందన్న విషయాన్ని తేల్చే దిశగా ఏసీబీ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కారు రేసుల ఒప్పందాలు జరిగిన కాలంలో మంత్రిగా ఉన్న కేటీఆర్ తో పాటు నాడు మునిసిపల్ శాఖ ప్రత్యేక ప్రదాన కార్యదర్శిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిలపై ఏసీబీ కేసులు నమోదు చేసింది. విచారణకు రావాలంటూ ముగ్గురికీ నోటీసులు జారీ చేసింది. ఏసీబీ నోటీసులకు సానుకూలంగానే స్పందించన కేటీఆర్… లాయర్లను వెంటబెట్టుకుని విచారణకు ఏసీబీ కార్యాలయానికి వెళ్లారు. లాయర్లను అనుమతించబోమని ఏసీబీ చెప్పగా…కేటీఆర్ విచారణకు వెళ్లకుండానే వెనుదిరిగారు. అయితే విచారణకు రావాలంటూ మరోమారు కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది.

ఈ క్రమంలో లాయర్లతో కలిసే విచారణకు హాజరవుతానని చెబుతున్న కేటీఆర్… అందుకు అనుమతించాలంటూ తెలంగాణ హైకోర్టులో బుధవారం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు… లంచ్ తర్వాత విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఏసీబీ విచారణకు లాయర్లతో కలిసి హాజరు కావడం కుదరదని కేటీఆర్ కు తేల్చిచెప్పింది. అయితే ఏసీబీ అధికారులు కేటీఆర్ ను విచారిస్తున్న సమయంలో… ఈ విచారణకు అల్లంత దూరాన కేటీఆర్ తరఫు లాయర్లు కూర్చునేందుకు కోర్టు అనుమతించింది. ఇలా కూర్చునే లాయర్లు ఎవరన్న విషయాన్ని కూడా తానే చెబుతానన్న కోర్టు… ఓ ముగ్గురు లాయర్ల పేర్లను ప్రతిపాదించాలని కేటీఆర్ కు సూచించింది. కేటీఆర్ సూచించే లాయర్లలో ఎవరు విచారణను పరిశీలించాలన్న విషయాన్ని చెబుతానని కోర్టు తెలిపింది.